disputes in ysr congress: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఉరవకొండ పట్టణంలోని శివరామిరెడ్డి కాలనీలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గీయుల మధ్య మాటల యుద్ధం జరిగింది. కాలనీకి శివరామిరెడ్డి పేరు పెట్టినందుకు ఇక్కడ అభివృద్ధి జరగలేదని కొందరు అన్నారు. ఆ పేరు కాకుండా ఇంకొక పేరు పెట్టి ఉంటే అధికారులు ఎప్పుడో వచ్చి ఈ పాటికి సమస్యలు పరిష్కరించేవారని ఓ వర్గం నాయకులు అన్నారు. దాంతో మరో వర్గం వాళ్ళు తమ నాయకుడు మంచి చేశాడు కాబట్టే.. ఈ కాలనీ ప్రజలు అభిమానంతో ఆయన పేరు కాలనీకి పెట్టారని ఒకరికొకరు వాదించుకున్నారు.
అయితే శివరామిరెడ్డి కాలనీ వాసులు కొన్ని సంవత్సరాలుగా వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉన్న మురికి కాలువ వెడల్పు చేసి పూడికను తొలగించే పనులు చేస్తుండగా ఇరువర్గాల వాళ్ళు ఈ పనులన్నీ తామే చేస్తున్నామని కాలనీ ప్రజల ముందు మాటల యుద్ధానికి దిగారు.
వరద సాయం అందరికి ఇవ్వాలని కొందరు గ్రామస్థులు జీడిపల్లి గ్రామంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని ప్రశ్నించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. తమ వర్గం వారికి సాయం అందకుండా చేశారని మాజీ ఎమ్మెల్యే ముందు గొడవకు దిగారు.