అనంతపురం జిల్లా పేరు చెప్పగానే తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితులు గుర్తొస్తాయి. ఏ పంట వేసినా నష్టాలు తప్ప.. లాభాలు పొందే రైతులు తక్కువే. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి రైతులు కూడా అందరిలాగే వ్యవసాయంలో నష్టపోయారు. సాగుతో నష్టాలు వచ్చినా పాడిని నమ్ముకోవడంతో.. వారికది ప్రధాన జీవనాధారంగా మారింది. దశాబ్దం క్రితం పశుపోషణ ప్రారంభించిన చెన్నంపల్లి రైతులు.. తొలిరోజుల్లో పాల వ్యాపారుల దోపిడీకి గురయ్యారు.
వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై పాలు విక్రయించుకునే పరిస్థితి ఉండేది. ఇలాంటి సమస్యలతో నష్టపోయిన గ్రామ రైతులంతా సొంతంగా పాల ఉత్పత్తులు తయారుచేసి అనంతపురంలో విక్రయించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇలా ప్రస్థానం ప్రారంభించి ఏడాది పొడవునా ఉపాధి పొందుతున్నారు. చెన్నంపల్లిలో దాదాపు వెయ్యి కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరిలో సుమారు 600 కుటుంబాలు కేవలం పశుపోషణే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నాయి. వీరంతా కలిసి 3,200కు పైగా గేదెలు, జెర్సీ ఆవులను పోషిస్తున్నారు.