RDT Trust Blind Students First Time Written SSC Exams on Computer in Anantapur :చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్నారు. కానీ విధి చిన్నచూపు చూసి అంధులను చేసింది. అయినా ఎక్కడా తగ్గలేదు. లోపాన్ని సైతం లెక్క చేయకుండా చదువుల్లో రాణించాలనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగారు. ప్రతిఫలంగా అత్యాధునిక సాంకేతికతను అనుసరించి.. ల్యాప్‌టాప్‌ల్లో పదో తరగతి పరీక్ష రాసి మంచి మార్కులు సాధించారు ఆ విద్యార్థులు.
ల్యాప్‌టాప్‌తో సాధన చేస్తున్న ఆ ఆరుగురు అమ్మాయిల పేర్లు దివ్యశ్రీ, ఎం.శ్రీధాత్రి, పి. చైత్రిక, యు.నాగరత్నమ్మ, ఇ.సౌమ్య, సి.పావని. వీరు అనంతపురం జిల్లాలోని ఆర్డీటీ దివ్యాంగుల పాఠశాలకు చెందినవారు. ఇందులో కొందరు పుట్టుకతో చూపులేని వారైతే, మరొకరు అనారోగ్యంతో హఠాత్తుగా కంటి చూపు కోల్పోయిన వారు. వారందరిని అక్కున చేర్చుకుని తీర్చిదిద్దుతోంది ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ.
అంధులకు సర్కార్ 'స్పెషల్' స్కూల్.. చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు టాప్!
సాధారణంగా అంధులు ఏ పరీక్ష రాయాలన్నా సహాయకులు అవసరం. వీళ్లు సమాధానాలు చెబుతుంటే వారు రాస్తుంటారు. కానీ, దేశంలోనే తొలిసారిగా.. ల్యాప్‌టాప్‌లు వినియోగించి సహాయకులు అవసరం లేకుండా.. అంధ విద్యార్థులే సొంతంగా పదోతరగతి పరీక్షలు రాశారు. అంతే కాదు మంచి ఫలితాలు సాధించి.. మన్ననలు అందుకున్నారు ఈ విద్యార్థులు.
"నేను 6వ తరగతిలో ఇక్కడ చేరాను. మాకు 8వ తరగతి ల్యాప్‌ట్యాప్స్ అందించారు. మేము ల్యాప్ ట్యాప్‌లో ఏ కీ ఎక్కడ ఉంటుందో నేర్చుకున్నాము. పదో తరగతి పరీక్షలు రాసే నెల ముందు నుంచి సాధన చేశాము." -శ్రీ ధృతి, విద్యార్థిని
తొలిసారి స్వయంగా పదో తరగతి పరీక్షలు రాసిన ఆంధ విద్యార్థులు..
ల్యాప్‌టాప్‌లో ఉన్న ప్రశ్నపత్రాన్ని హెడ్‌ఫోన్ల ద్వారా విని, జవాబును టైప్ చేశారు ఈ విద్యార్థులు. ఇందుకోసం నాన్ విజబుల్ డెస్క్ టాప్ యాక్సెస్ సాఫ్ట్‌వేర్ వినియోగించారు. అందులో టైప్ చేసిన జవాబులు ప్రింట్ తీసి.. ఓఎంఆర్ షీట్‌కు జత చేస్తారు. పరీక్షలకు ముందు 45 రోజుల్లోనే ఈ విధానంలో శిక్షణ పొంది ఫలితాలు సాధించి భళా అనిపించారు ఈ విద్యార్థులు.
"మాకు ఆరు, ఏడు తరగతి చదువుతున్న సమయంలో కంప్యూటర్ ల్యాబ్‌కు వెళ్లి.. అక్కడ ఉపాధ్యాయుల సహాయంతో కంప్యూటర్‌లో ఏ వరుసలో ఏ కీ ఉంటుందనే విషయాన్ని మొదటగా నేర్చుకున్నాము. కోవిడ్ సమయంలో మాకు ల్యాప్ ట్యాప్స్ ఇచ్చారు. ఏ అప్లికేషన్ ఎలా ఓపెన్ చేయాలి.. ఎలా వాడాలి అనేది నేర్చుకున్నాము." -సౌమ్య, విద్యార్థిని