అనంతపురం జిల్లా ఉరవకొండ బాస్కెట్‌బాల్ క్రీడాకారులు మొక్కలు నాటి సంవత్సరైన సందర్భాన్ని వినూత్నంగా జరుపుకొన్నారు. తాము నాటిన మొక్కలు ఇప్పుడు ఇలా పెరగడం చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. చదువు, ఆటలతోపాటు ఇలా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏటా ఇలా మొక్కలు నాటడం జరుగుతుందని చిన్నారి క్రీడాకారులు అన్నారు.
క్రీడాకారులు అంటే కేవలం క్రీడలకే పరిమితం కాదని సమాజసేవలో తాము భాగస్వాములం అని చిన్నారులు తమ పెద్ద మనసు చాటారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉరవకొండ బాస్కెట్‌బాల్ సమైక్య ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తుంది. అయితే వారికి కేవలం బాస్కెట్బాల్ శిక్షణ మాత్రమే కాకుండా సామాజిక కార్యక్రమాలపై వారిని చైతన్యం చేస్తున్నారు. ఇందులో భాగంగా శిక్షణకు హాజరవుతున్న చిన్నారులు వృద్ధాశ్రమం, ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లు క్రీడాకారుల చేతుల మీదుగా అనాధలకు రోగులకు పంపిణీ చేశారు. పిల్లలకు క్రీడలు చదువుతో పాటు సామాజిక దృక్పథం ఎంతో అవసరమని ఇలా చేయడం ద్వారా పిల్లలకు సమాజంపై ఎంతో గౌరవం ఉంటుందని వారు అన్నారు. పిల్లలకు ఇప్పటి నుండే సమాజంపై అవగాహన, సహాయం చేయాలనే తత్వం ఏర్పడుతుందని బాస్కెట్‌బాల్ శిక్షకులు తెలిపారు.