AP EMPLOYEES UNION PRESIDENT SURYANARAYANA : ఆర్థిక ప్రయోజనాలు, హక్కుల సాధన కోసం గవర్నర్‌ను కలవడం నేరమెలా అవుతుందని.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రశ్నించారు. గవర్నర్‌ను కలవడంపై ప్రభుత్వం సంజాయితీ ఎలా కోరుతుందని... తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్థిక ప్రయోజనాలు హక్కుల సాధన కోసం ఏప్రిల్ నుంచి చేపట్టనున్న ఆందోళనల సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆయన అనంతపురంలో పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులతో కలిసి ఆయన అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా సంగమేస్ సర్కిల్లోని పద్మావతి ఫంక్షన్ హాల్ వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. తాము చేపట్టబోయే ఉద్యమం ఫలితం రాబట్టే దిశగా ఉంటుందన్న ఆయన.. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నేరవేరే వరకూ పోరాటం ఆగబోదని తేల్చిచెప్పారు.
పది వేల కోట్ల రూపాయలు.. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటే.. కేవలం 3 వేల కోట్ల రూపాయలు ఇస్తూ ఉద్యోగులను ఉద్ధరిస్తున్నామని ప్రభుత్వ సలహాదారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రూ. 20 వేల కోట్లను ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సి ఉందన్నారు. సంఘాన్ని రద్దు చేస్తున్నామని ప్రభుత్వానికి భజన చేసే సంఘాలు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. అరెస్టులు చేసిన, కేసులు నమోదు చేసిన ఉద్యమాలను ఆపేది లేదని తేల్చిచెప్పారు.