ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటకు మైదానం లేదు.. పాఠానికి గదీ లేదు!

ప్రభుత్వ పాఠశాలలకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి కల్పించాలనే ఉద్దేశంతో నాడు నేడు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనులు ప్రారంభమై 10 నెలలు దాటింది. ఇప్పటికే ఐదుసార్లు గడువు పొడిగించారు. అయినా పూర్తి చేయలేకపోయారు. ఎంపిక చేసిన అన్ని పాఠశాలల్లో వివిధ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈనెల 2వ తేదీన 9, 10 తరగతులు, 23 నుంచి 6,7,8, డిసెంబరు 14 నుంచి 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించారు. తరగతుల నిర్వహణకు నాడు-నేడు పనులు అడ్డంకిగా మారాయి. తరగతులు నిర్వహించేదెలా? బోధన సాగించేదెలాగని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Nov 1, 2020, 5:48 PM IST

anantapuram nadu nedu school works
అనంతపురం పాఠశాలల్లో నాడు నేడు పనులు

ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్డి, మూత్రశాలలు అత్యవసరం. వీటి వినియోగానికి నీరు తప్పనిసరి. అనంతపురం జిల్లాలో 1,218 తాగునీటి పనులు మంజూరు కాగా.. ఇప్పటిదాకా 242 పనులే పూర్తయ్యాయి. గతంలో ఉన్న 1,207 మరుగుదొడ్లు చెదరగొట్టి, నాడు-నేడులో భాగంగా చేపట్టిన పనులు 858 పాఠశాలల్లో పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నవంబరు 2న పాఠశాలలు ప్రారంభిస్తే విద్యార్థులు, ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకం.

ఎక్కడి పనులు అక్కడే...

జిల్లాలో 1,233 మేజర్‌, మైనర్‌ పనులు మంజూరు కాగా.. 321 పనులు మాత్రమే వందశాతం పూర్తయ్యాయి. 1,243 విద్యుత్తు మరమ్మతు పనులకు గాను 683 పూర్తి చేశారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. పాఠశాల ఆవరణలో నిర్మాణ సామగ్రి ఉంది. మైదానాల్లో వేసిన వ్యర్థాలు తొలగించకపోవడంతో.. అడుగు వేయడానికి ఇబ్బందిగా ఉంది. తరగతి గదుల్లో విలువైన సామగ్రి, సిమెంటు నిల్వ ఉంచారు. ఇంకొన్ని గదుల్లో పనులు సాగుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాలేదు.

అనంతపురం పాఠశాలల్లో నాడు నేడు పనులు

కారణాలెన్నో..

రాష్ట్ర స్థాయిలో తరచూ మార్పులు చేర్పులు చేయడంతో తొలినాళ్లలో పనులు ముందుకు సాగలేదు. మూడు నెలలపాటు నిధులు ఆగిపోయాయి. 10 రోజుల కిందటే నిధులు పాఠశాలలకు జమ కావడంతో.. అక్కడక్కడ పనులు ప్రారంభించారు. కొన్నిచోట్ల పాఠశాల స్థాయిలోనే సామగ్రి కొనుగోలు చేశారు. ఇంకొన్నిచోట్ల కేంద్రీకృత విధానంలో అందిస్తున్నారు. గ్రీన్‌చాక్‌ బోర్డులు 278, వాష్‌బేషిన్లు 265, యూరినల్స్‌ 122, ఈడబ్ల్యూసీ 115, అల్మరాలు 44, పలు రకాల డెస్క్‌లు 21, పంకాలు 707 మాత్రమే సరఫరా అయ్యాయి. మరోవైపు సిమెంటు, ఇసుక కొరత నెలకొంది. ఈనెల 15 వరకు గడువు ఇచ్చారు. అప్పటిలోగా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో అనంతకు 7వ స్థానం దక్కింది.

అందుబాటులోకి తెస్తాం:

విద్యార్థులకు కొన్ని గదులు అందుబాటులోకి తెస్తాం. ప్రధానోపాధ్యాయుల స్థాయిలో చేయాల్సిన పనులు పూర్తి చేయిస్తాం. విద్యార్థులకు ఏవిధమైన ఇబ్బంది లేకుండా చూస్తాం. - శామ్యూల్‌, డీఈఓ.

అనంతపురం పాఠశాలల్లో నాడు నేడు పనులు

ఇదీ చదవండి:అర్హులైన లబ్ధిదారులకు పరిహారం చెల్లించాలి'

ABOUT THE AUTHOR

...view details