అనంతపురం జిల్లా(Anantapur district)లో పండిన అరటికి మన దేశంలోనే కాకుండా... ఎడారి దేశాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ సాగు చేసిన అరటి నాణ్యత, రుచి బాగుంటుందని అరబ్ దేశాల్లో ప్రత్యేక ధరతో అమ్మకాలు చేస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అరటి(Banana orchards) పై రెండేళ్లుగా సిగటోకా వైరస్(Sigatoka virus) విరుచుకుపడి రైతుల(Farmers)కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే చాలామంది రైతులు అరటి సాగును వదిలేశారు. సిగటోకా వైరస్ సోకితే అరటి ఆకులపై మచ్చలు పడి, ఎండిపోతాయి. అరిటి గెల కోత సమయం రాకముందే చెట్టుమీదనే పండిపోయి, గెల రాలిపోతుంది.
కూలీల ఖర్చు కూడా రావట్లేదు
జిల్లా వ్యాప్తంగా 16 వేల హెక్టార్లలో అరటిని సాగు చేస్తున్నారు. రైతుల నుంచి రెండు కార్పొరేట్ సంస్థలు కొంతమేర కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేసేవి. సిగటోకా వైరస్ వచ్చినప్పటి నుంచి ఆ సంస్థలు కూడా ముఖం చాటేశాయి. వైరస్ వచ్చిన తోటలో గెలలు కొట్టి ఎగుమతి చేస్తే, రవాణాలోనే మాగిపోయి, గమ్యం చేరే సమయానికి కుళ్లిపోతాయని రైతులు చెబుతున్నారు. దీనివల్ల స్థానిక వ్యాపారులు, దళారులు తక్కువ ధరకే పంటను కొంటున్నారు. టన్ను రెండు వేల చొప్పున విక్రయిస్తే కూలీల ఖర్చుకూడా రాదని రైతులు(Farmers) వాపోతున్నారు.