అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లి గ్రామంలో ఏర్పాటైన ఏఎం లింగన్న సేవా మందిర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (AM Linganna Seva Mandir government high school)కు ఎంతో ప్రత్యేకత ఉంది. స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో గాంధీ ప్రసంగాలకు ప్రభావితుడైన లింగన్న గాంధీ మార్గాన్ని అనుసరిస్తూ ఆయన బాటలో నడిచేవారు. ప్రజలను విద్యావంతులు చేయాలని సంకల్పించారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటుకు సుమారు 5 ఎకరాలు సొంత భూమిని కేటాయించారు. 1961 అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున ఈ పాఠశాల ప్రారంభమైంది. ఏఎం లింగన్న సేవా మందిర్ పేరుతో విద్యాలయాన్ని స్థాపించి విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు.
ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు గాంధేయవాదాన్ని అలవరిచేలా వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మహాత్ముని బాటలో నడిచేందుకు విద్యార్థులు కచ్చితంగా టోపీ ధరించాలి అనే నిబంధన పెట్టారు. నాడు ప్రారంభమైన ఈ నిబంధన 60 ఏళ్లుగా నేటికీ నిర్విరామంగా కొనసాగుతోంది. విద్యార్థినులు సైతం సంప్రదాయ వస్త్ర ధారణతో పాటు కచ్చితంగా మధ్య పాపిడి, రిబ్బన్‌తో రెండు జడలు వేసుకోవాల్సిందే. లేకపోతే పాఠశాలలోకి అనుమతి లేదు. బడిలో పాఠ్యాంశాలతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల గాథలను విద్యార్థులకు బోధిస్తుంటారు. విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.