అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం అడిగుప్ప గ్రామంలోని ఓ సంప్రదాయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుత సమాజంలో ఏ గ్రామంలో చూసినా మద్యం కనిపిస్తుంది. ఈ ఊరిలో మాత్రం ఆ ఊసే ఉండదు. సుమారు మూడు వందల ఏళ్లుగా ఇక్కడ మద్య నిషేధం అమల్లో ఉంది. అంతేకాదు ఇక్కడివారు కోడి మాంసం, కోడి గుడ్డు కూడా తినరు. వీరు ఇంత కఠిన సంప్రదాయం పాటించడం వెనుక ఓ చరిత్ర ఉంది.
అప్పటి నుంచి నిషేధం
సుమారు 3 శతాబ్దాల ఈ ప్రాంతాన్ని పాలించే సామంతరాజు కోట విడిచి విహారయాత్రకు వెళ్లాడు. అదే సమయంలో చిత్రదుర్గానికి చెందిన రాజు ఇక్కడున్న సంపదను దోచుకునేందుకు వ్యూహం పన్నాడు. ఇక్కడున్న ప్రజలకు మద్యం, కోడి మాంసం తినిపించాడు. అంతా మత్తులోకి జారుకున్నాక సొమ్ము దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజు... తిరిగి వచ్చి వారితో పోరాడి విజయం సాధిస్తాడు. శత్రువులు ఇంత సాహసానికి ప్రయత్నించడానికి కారణం మద్యం, మాంసం అని గుర్తించిన ఆయన...ఇకనుంచి వీటిని తాకమని ప్రమాణం చేయించాడట. ఇక అప్పటినుంచి నేటి వరకు గ్రామంలో మద్యం, కోడిమాంసం నిషేధం. గ్రామస్థులు ఎవరూ ఈ నిబంధనను అతిక్రమించరు. బయటివారు వచ్చినా.. దీనికి కట్టుబడి ఉండాల్సిందే.