అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి కార్యాలయంలో మద్యం సేవించిన వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించారు. కార్యాలయంలోనే కార్యదర్శి అక్బర్ మద్యం తాగిన వ్యవహారంపై.. ఏడీ పరమేష్ విచారణ చేపట్టారు. కదిరి మార్కెట్ కార్యదర్శి అక్బర్ పై గతంలోనే ఫిర్యాదులు అందినట్లు విచారణ అనంతరం ఏడీ తెలిపారు. విధి నిర్వహణ సమయంలో కార్యదర్శి తీరుపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్లు గతంలోనే మార్కెట్ కమిటీ సభ్యులకు తెలిపినట్లు ఏడీ చెప్పారు. అప్పట్లో కమిటీ ఛైర్మన్.. కార్యదర్శిపై చర్యలకు అంగీకరించని విషయాన్ని తెలిపారు. తాజాగా మూడు రోజుల కిందట కార్యదర్శిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాత పూర్వకంగా కమిటీ సభ్యులు విజప్తి చేశారు.
మార్కెట్ కమిటీ సభ్యుల సూచన మేరకు కదిరి కార్యదర్శిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకుడికి నివేదిక పంపినట్లు తెలియచేశారు. నివేదిక ఆధారంగా అక్బర్ ను విధుల నుంచి తప్పించి హిందూపురం కార్యదర్శికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. బుధవారం మరోసారి కార్యదర్శి వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో విచారణ చేపట్టి అక్బర్ సామగ్రిని కార్యాలయం నుంచి తరలించాలని సిబ్బందిని ఆదేశించారు.