High Level Committee on Atchutapuram incident: అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు లీక్ ఘటనపై ముఖ్యమంత్రి జగగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై సీఎం ఆరా తీశారు. విషవాయువు లీక్ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు గల కారణాలను వెలికితీయాలన్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరిపించాలని అధికారులను ఆదేశించారు.
ఏం జరిగిందంటే:అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువు లీకైంది. సీడ్స్ దుస్తుల ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకేజీ కారణంగా దాదాపు 100మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వికారంతో స్పృహ తప్పి పడిపోయారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే కొందరికి ప్రథమచికిత్స అందించారు. మరి కొందరిని ఫ్యాక్టరీ బస్సులు, కార్లు, అంబులెన్సుల్లో అచ్యుతాపురం, అనకాపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. పెద్ద సంఖ్యలో మహిళలు వాంతులు, వికారంతో ఆర్తనాదాలు చేశారు. బి షిఫ్ట్‌లో ఫ్యాక్టరీలో దాదాపు 4 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా వారిలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.