ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లి జిల్లాలో వింత ఆచారం.. తోడుపెద్దుతో యువకుడికి పెళ్లి - Anakapalli district in strange wedding

Anakapalli district in strange wedding: అనకాపల్లి జిల్లాలో తాజాగా వింత పెళ్లి జరిగింది. ఓ యువకుడికి ఆ ఇంటి పెద్దలంతా కలిసి తోడుపెద్దుతో సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. ఆ పెళ్లికి ఊరి ప్రజలంతా హాజరై ఉత్సహంతో నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వింత పెళ్లికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే, ఈ వింత పెళ్లికి ఓ కారణం ఉందంటూ ఆ పెళ్లి పెద్దలు వివరించారు.

Anakapalli district
Anakapalli district

By

Published : Feb 18, 2023, 3:48 PM IST

Anakapalli district in strange wedding: పెళ్లి అనేది ప్రతి యువకుడి, యువతి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. అంతేకాదు అదొక మధురమైన జ్ఞాపకం. కుమారుడికి లేదా కుమార్తెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించిన రోజు నుంచి.. సంబంధాల కోసం బంధుమిత్రులతో చర్చలు జరపటం మొదలెడుతారు. ఈ క్రమంలో ఏదైనా సంబంధం కుదిరితే.. అటేడు తరాలు, ఇటేడు తరాల వివరాలను తెలుసుకొని.. ఆ ఇద్దరి జాతకాల వివరాలను సరి చూసి, పొంతనములు కుదిరిన పిదప సంబంధాన్ని నిశ్చయించుకుంటారు. ఆ తర్వాత సంప్రదాయ ప్రకారం చేయాల్సిన కార్యక్రమాలను పూర్తి చేసి ముహూర్తాన్ని ఖరారు చేస్తారు. కానీ.. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం జాలంపల్లి గ్రామానికి చెందిన ఓ తండ్రి తన కొడుకుకు వింత ఆచారం ప్రకారం వివాహం జరిపించాడు.

వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం జాలంపల్లి గ్రామంలో తాజాగా ఓ వింత పెళ్లి జరిగింది. యువకుడికి ఆ ఇంటి పెద్దలంతా కలిసి వారి ఇంట పుట్టిన తోడుపెద్దుతో (ఎద్దు) సంప్రదాయబద్దంగా వివాహం జరిపించారు. ఇంటి ముందు పందిరి వేసి, భాజా భజంత్రీలతో కళ్యాణం చేయించారు. అంతేకాదు ఆ వింత పెళ్లికి ఊరి ప్రజలందరినీ ఆహ్వానించి భోజనాలు పెట్టించి.. నూతన వధూవరులను ఊరేగించారు.

ఈ వింత ఆచారంపై యాదవ ప్రతినిధులు వివరాలను వెల్లడించారు. ''మా గ్రామంలో సంక్రాంతి సమయంలో తోడపెద్దును (ఎద్దు) ఊరేగించే ఆచారం పూర్వీకుల నుంచి ఉంది. దానిని మేము తరతరాలుగా ఆచరిస్తూ వస్తున్నాము. అయితే, కొన్నాళ్ల క్రితం ఈ తోడపెద్దు (ఎద్దు) చనిపోయింది. మూడేళ్ల క్రితం భోగి పండుగ రోజున మురుకుతి రామనాయుడు ఇంటిలో ఓ దూడ జన్మించింది. ఆ దూడను సింహాద్రి అప్పన్న పుట్టుకగా మేము భావించి.. మూడేళ్ల వయసు వచ్చిన తర్వాత ఆ ఇంటిలో పెళ్లి కాని యువకుడితో ఆ తోడపెద్దుకు (ఎద్దు) పెళ్లి జరిపించాలి. ఆ పెళ్లిని వైకుంఠంలో జరిగిన దేవుని పెళ్లిగా మేమంతా భావిస్తాము. ఆ ప్రకారమే.. ఈ పెళ్లిని సాంప్రదాయకంగా నిర్వహించాము. అయితే.. ఆ యువకుడికి పెళ్లి వయస్సు వచ్చాక అతను మళ్లీ స్త్రీని (యువతి) హిందూ ఆచారం ప్రకారం వివాహం చేసుకోవచ్చు.'' అని యాదవ పెద్దలు వివరించారు.

ఈ వింత పెళ్లికి.. తాటాకుల పందిరి వేసి, ఊరంతా భోజనాలు పెట్టి.. భాజా భజంత్రీలతో వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక గ్రామంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. చిన్నలు, పెద్దలు అక్కడికి చేరుకొని సందడి చేశారు. అయితే, ఈ వింత వివాహం జరిగింది.. రైతు రామునాయుడు కుమారుడు వరహాల నాయుడికి, తోడుపెద్దుకి పెళ్లి చేశారు. ఈ వింత పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇలాంటి రోజుల్లో వింత వింత ఆచారాలు ఇంకా ఉన్నాయా? అంటూ నెటిజన్స్ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

అనకాపల్లి జిల్లాలో వింత ఆచారం.. తోడుపెద్దుతో యువకుడికి పెళ్లి

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details