ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గిరిజనులకు తప్పని డోలి మోతలు.. నిండు గర్భిణిని 4 కి.మీ మోసుకుని..

By

Published : Mar 13, 2023, 1:55 PM IST

Updated : Mar 13, 2023, 3:44 PM IST

TRIBALS CARRIED PREGNANT WOMAN ON DOLI: పురిటి నొప్పులతో బాధ పడుతున్న ఓ నిండు గర్భిణిని డోలిలో అవస్థలు పడుతూ నాలుగు కిలోమీటర్లు మేర తీసుకెళ్లాల్సిన దుస్థితి గిరిజనులకు ఎదురైంది. ఈ సంఘటన అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని అనంతగిరి మండలం పినకోట పంచాయతీలోని ఓ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

నిండు గర్భిణిని డోలిపై మోసుకుని వెళ్తున్న గిరిజనులు
నిండు గర్భిణిని డోలిపై మోసుకుని వెళ్తున్న గిరిజనులు

నిండు గర్భిణిని డోలిపై మోసుకుని వెళ్తున్న గిరిజనులు

TRIBALS CARRIED PREGNANT WOMAN ON DOLI: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గర్భిణీల డోలి మోతలు తప్పడం లేదు. తాజాగా అనంతగిరి మండలం పెనకోట పంచాయతీ రాచకీలం కొండపై గ్రామంలో సూకూరు లక్ష్మి(20) అనే గర్భిణీకి ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే 108 కి ఫోన్ చేయగా.. ఆ గ్రామానికి రహదారి సౌకర్యం లేనందును గర్భిణీని రోడ్డు మార్గానికి తీసుకురమ్మన్నారు. దీంతో కొండపైన రాచకిలం నుంచి గుమ్మంతి వరకు నాలుగు కిలోమీటర్ల మేర రాళ్లు, రప్పలు, ఎత్తైన కొండ మార్గం నుంచి మైదాన ప్రాంతం గుమ్మంతి వరకు ఆమెను డోలిపై మోసుకుని అంబులెన్సు వద్దకు వచ్చారు.

అనంతరం అంబులెన్సులో ఆమెను పినకోట ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అయితే అక్కడ వైద్యులు లేకపోవటం వల్ల ఆమెను కే.కోటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అక్కడ వైద్యుల సూచన మేరకు ఆమెను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడే చికిత్స పొందుతోంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కూడా ఇదే రీతిలో డోలిపై తీసుకుని వచ్చి.. ఆస్పత్రిలో చేర్చిన ఇద్దరు రోగులు చికిత్స పొందుతూ మృతి చెందారు.

నిలిచిపోయిన రహదారి పనులు:
ఆ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవటం వల్ల ఎలాంటి వైద్య సేవలు కావాలన్నా.. డోలి మోతలే గత్యంతరం అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం గతేడాది నవంబరు నెలలో శ్రమదానంతో రహదారి నిర్మాణానికి రాచకిలం గ్రామస్తులు నడుం బిగించి.. మూడు కిలోమీటర్లు మేర రహదారిని నిర్మించుకున్నారు. ఈ నిర్మాణానికి 100 మంది రెండు నెలల పాటు పనిచేశారు. ఈ వ్యవహారంపై అల్లూరి జిల్లా కలెక్టర్ స్పందించి ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం ద్వారా 10 లక్షలు మంజూరు చేసినట్లు ఎస్టిమేషన్ కాపీ అందజేశారు.

అయితే అటవీశాఖ అధికారులు తమ అనుమతులు లేనిదే శ్రమదానం చేసి రహదారి నిర్మిస్తే.. కేసులు పెడతామని బెదిరించినట్లు గ్రామస్థులు వాపోతున్నారు. అయితే అప్పటినుంచి శ్రమదానంతో రహదారి పనులు ఆగిపోయాయని, ఈ విషయంపై అల్లూరి సీతా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. రహదారి సౌకర్యం లేకుండా మారుమూల గ్రామాలకు రాకపోకలు ఎలా జరుగుతాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి.. తమ సమస్యలను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Last Updated : Mar 13, 2023, 3:44 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details