Public Opinion On Pumped Storage Project: రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుపై కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నేడు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. దీని కోసం ఏపీ జెన్కో యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. సీలేరు సమీపాన పార్వతీ నగర్ వద్ద 1350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మించడానికి ఏపీ జెన్కో నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ మేరకు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుపై పర్యావరణ అభ్యంతరాలు కోసం శనివారం సీలేరులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు.
ప్రజాభిప్రాయ సేకరణకు వేదికైన ఫుట్బాల్ మైదానం: స్థానిక ఫుట్బాల్ క్రీడా మైదానంలో వేదికను ఏర్పాటు చేశారు. సుమారు మూడు వేల మందికి సరిపోయే విధంగా గ్యాలరీ తయారు చేశారు. ధారకొండ, దుప్పిలవాడ, సీలేరు పంచాయతీల పరిధిలో కాలుష్య నియంత్రణ మండలి సూచించిన సుమారు 22 గ్రామాలు ప్రజలు ఈ సేకరణకు హాజరయ్యే అవకాశం ఉండటంతో.. అందుకు అవసరమయిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఎస్ఈ KKV ప్రశాంత్ కుమార్, ఈఈ ప్రభాకర్, బాలకృష్ణ, బాబూరావులు వేదిక ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు.