అమాయక గిరిజనుల్ని ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం చేస్తోన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరుడు దూడ విక్టర్‌బాబు దందాలపై దర్యాప్తు చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం చెట్లవాడ గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు దూడ విక్టర్ బాబు ఎమ్మెల్సీ అనంతబాబు కీలక అనుచరుల్లో ఒకరని, అనంతబాబు, వైకాపా పేరు చెప్పుకుని గిరిజనుల్ని మోసగిస్తున్నారని ఆరోపించారు.
వైకాపా ప్రభుత్వం రాగానే ప్రభుత్వ ఉన్నతపాఠశాలల్లో అటెండర్ ఉద్యోగాలు వేయిస్తానని ఏడుగురు గిరిజనుల వద్ద పది లక్షల రూపాయలు వసూలు చేసిన విక్టర్ బాబు..వాళ్లకీ ఉద్యోగాలు వేయించకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా దారుణంగా మోసగించారని నారా లోకేశ్ అన్నారు. ఘటనపై కేసు నమోదు చేయాలన్నారు. నిరుపేద గిరిజనులైన బొజ్జరాయిగూడేనికి చెందిన కాక మహేష్, బొగ్గ లక్ష్మణ్, బొగ్గ రవి, పులి ధర్మయ్య, రేపాకకి చెందిన కరక దారయ్య, రేగులపాడు వాసి సోడే లక్ష్మి, వేగితోటకి పండా అశోక్‌ల నుంచి.. ఒక్కొకరి నుంచి రూ.1.50 లక్షలు వసూల్ చేశాడన్నారు.