ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Polavaram: పోలవరం ప్రాజెక్టు భూసేకరణలో అక్రమాలు.. దళారులతో అధికారులు కుమ్మక్కై - scam in Polavaram project land acquisition compensation

పోలవరం ప్రాజెక్ట్‌ కోసం ఇల్లు, వాకిలి, భూమి సహా సర్వం కోల్పోయిన నిర్వాసితులకు కాకుండా. పరిహారం దళారుల పరమవుతోంది. అధికారులతో కుమ్మక్కై అసలు లబ్ధిదారులను నిండా ముంచేస్తున్నారు. జెన్యూనిటీ సర్టిఫికెట్ల జారీలోనే అక్రమాలకు పాల్పడిన దళారులు.. పరిహారాన్ని వాటాలేసుకుని పంచేసుకున్నారు.

Inquiry on irregularities in distribution of compensation
Inquiry on irregularities in distribution of compensation

By

Published : May 8, 2022, 7:05 AM IST

పోలవరం భూసేకరణలో జెన్యూనిటీ సర్టిఫికెట్ల జారీలోనే అవినీతి

పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణ పరిహారం పంపిణీలో అధికారులు, దళారులు కుమ్మక్కై అసలు లబ్ధిదారులను ముంచేశారు. భూమి లబ్ధిదారు ఫలానా వ్యక్తేనని నిర్ధారించే జెన్యూనిటీ సర్టిఫికెట్ల జారీలోనే అక్రమాలకు పాల్పడ్డారు. పోలవరం ప్రాజెక్టులో కొండ పోరంబోకు భూముల సేకరణలో అక్రమాలు వాస్తవమేనని ఉన్నతాధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా దేవీపట్నం మండలంలో భూసేకరణ అక్రమాలను తాజాగా ‘ఈనాడు’-ఈటీవీ భారత్​ వెలుగులోకి తేవడంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసినట్లు తెలిసింది. రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌ ఆదిత్య జరిపిన విచారణలో గుబ్బలంపాలెం గ్రామానికి చెందిన ఏడుగురు గిరిజనుల భూముల విషయంలో అక్రమాలు జరిగి దాదాపు రెండున్నర కోట్లు పరుల పరమైనట్లు తేలింది. తాజాగా దేవీపట్నం మండలం మంటూరు పంచాయతీలోనూ అవకతవకలు వెలుగు చూశాయి. ఇక్కడి నుంచి ఓ గిరిజనుడు తమ కుటుంబానికి చెందిన 7 ఎకరాల భూమికి దొంగ పట్టాలు సృష్టించి, పరిహారం ఇతరులకు ఇచ్చేశారని శనివారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు.

ఇదే మండలం బూరుగుగొంది గ్రామంలోనూ 30 ఎకరాలకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు పోలీసుకు ఫిర్యాదులు అందాయని తెలిసింది. దీనిపై బాధితులు శనివారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. దళారులతో కలిసి అధికారులు నిబందనలు తుంగలో తొక్కినట్లు తెలిసింది. సాధారణంగా భూసేకరణ సమయంలో సెటిల్‌మెంటు భూములు, ఇతరత్రా పక్కా హక్కులున్న వాటికి సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్‌ ఇస్తారు. ఏ సర్వే నంబరులో ఎంత భూమి ఎవరి పేరున ఉందో జాబితా ప్రచురించి, అభ్యంతరాలను ఆహ్వానిస్తారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే డ్రాఫ్టు డిక్లరేషన్‌ ఇచ్చి అర్హులకు పరిహారం అందిస్తారు. పోలవరం భూసేకరణలో.. ఏజెన్సీ ప్రాంతంలోని కొండపోరంబోకు భూములకు అప్పటికే ప్రభుత్వం ఇచ్చిన డీ ఫాం పట్టాల మేరకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. పారదర్శకత లేకపోవడం, జాబితాలను గ్రామస్థులకు అందుబాటులో ఉంచకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి.

దేవీపట్నం మండలంలో కొండపోరంబోకు భూములకు జెన్యూనిటీ సర్టిఫికెట్‌ జారీలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిసింది. ఫలానా సర్వే నంబరు భూమి ఫలానా వారి ఆధీనంలో ఉందని క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించాలి. వారు స్వయంగా తనిఖీ చేసి, ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. ఓ రెవెన్యూ అధికారి దళారులతో కుమ్మక్కై ఇష్టారీతిన జెన్యూనిటీ సర్టిఫికెట్లు ఇచ్చేయడంతోనే అక్రమాలకు బీజం పడింది. అధికారుల విచారణతో తాజాగా సిద్ధం చేసిన కొన్ని పేజీలను అడంగల్‌లో చేర్చి, పాత పేజీలను తొలగించేందుకు ప్రయత్నాలు చేశారు. ఇది తెలిసి ఉన్నతాధికారులు ఆ అడంగల్‌ను తమవద్దకు రప్పించుకున్నట్లు సమాచారం.

పరిహారం చెల్లింపునకు ఓ అధికారి పర్సంటేజీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకుల్లో సొమ్ము జమ అయినా...దళారుల ద్వారా మళ్లీ పర్సంటేజీలు డిమాండ్‌ చేసి అవి అందేవరకు పరిహారం చెల్లించడం లేదని సమాచారం. కొండపోరంబోకు భూములకు క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఆధీనంలో ఉన్న వ్యక్తుల నుంచి సంతకాలు సేకరించి పరిహారం చెల్లించాలి కానీ అలా జరగలేదు. డీ ఫాం భూములకు పరిహారం ఏ గ్రామంలో ఇచ్చారు.. ఏ గ్రామంలో ఇవ్వలేదో అక్కడి ప్రజలకే స్పష్టత లేదు. నిజమైన లబ్ధిదారులు పరిహారం కోసం ఎదురు చూస్తుంటే...అవి అప్పటికే పరుల పరమైపోయాయి.

ముగ్గురు నలుగురు దళారులు ముఠాగా ఏర్పడి... ప్రతి గ్రామంలోనూ సర్వే నంబర్ల వారీగా కొండపోరంబోకు భూములు, వాటిలో పరిహారం ఎవరికి పరిహారం అందిందీ.. ఎవరికి అందలేదో వివరాలను సేకరించారు. అవే సర్వే నంబర్లు లేదంటే చిన్నచిన్న మార్పులతో వేరే వారి పేరున నకిలీ డీ ఫాం పట్టాలు సిద్ధం చేశారు. ఆ గ్రామంలోని వేరే గిరిజనులతో ముందే మాట్లాడుకుని....చెక్కులు రాగానే అవి తీసుకుని వారికి ఎంతో కొంత ముట్టజెప్పారు. మరికొందరు అధికారులతో కలిసి గుట్టుచప్పుడు కాకుండా సొంత ఖాతాలకే పరిహారం సొమ్ము మళ్లించుకున్నట్లు తెలసింది.

ఇదీ చదవండి:'స్వగృహ' ప్లాట్లు పెద్దల పరం.. ఆరు భారీ ప్లాట్ల వేలానికి ప్రకటన !

ABOUT THE AUTHOR

...view details