కరోనాతో కుదేలైన తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా కల్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా తెరాస మేనిఫెస్టోను ప్రకటించిన కేసీఆర్.. పరిశ్రమకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి మేనిఫెస్టోలో టాలీవుడ్‌కు స్థానం కల్పించిన తెరాస.. హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. 10 కోట్లలోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. థియేటర్ల యాజమాన్యాల వినతులపై స్పందించిన కేసీఆర్.. థియేటర్లకు పలు రాయితీలను ప్రకటించారు.
సినిమా టికెట్ ధరలో సవరణలు చేసుకునేందుకు అనుమతి
రోజువారీ ప్రదర్శనల సంఖ్య పెంచుకునేందుకు వీలు కల్పించడంతోపాటు.. సినిమా టికెట్ ధరలో సవరణలు చేసుకునేందుకు అనుమతి ఇస్తామన్నారు. వ్యాపార సంస్థలతోపాటు థియేటర్లకు సంబంధించి కనీస విద్యుత్ ఛార్జీలను రద్దు చేయనున్నట్లు తెలిపారు. థియేటర్ల పునఃప్రారంభం విషయంలో సినీ పరిశ్రమకు పూర్తి అధికారం ఇస్తున్నామన్న కేసీఆర్.. కరోనాను దృష్టిలో పెట్టుకొని సినీ పెద్దలు వ్యూహాత్మకంగా ఆలోచించాలన్నారు. తెరాస ప్రకటించిన హామీల పట్ల సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. కరోనాతో చీకట్లు కమ్ముకున్న సినీ పరిశ్రమకు కేసీఆర్ ప్రకటన.. వెలుగులు నింపిందని నటుడు నాగార్జున అన్నారు.