సొంతూరుకు వెళ్తున్న ఓ మహిళకు వాహనంలోనే ప్రసవమైంది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులకు బిహార్, మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలు 60 మంది వచ్చారు. వారిలో బిహార్‌కు చెందిన వాణిదేవి దంపతులు కూడా ఉన్నారు. వర్షాలు ప్రారంభమవడం వల్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. పనులు ఆగిపోవటం వల్ల కూలీలు.. బిహార్ వెళ్లేందుకు రైలు టికెట్‌లు బుక్ చేసుకున్నారు.
చిన్నగూడూరు నుంచి కాజీపేటకు వెళ్లేందుకు తోటి కూలీలతో కలిసి టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో దంతాలపల్లి శివారులోకి చేరుకున్నాక వాణిదేవికి పురిటి నొప్పులు వచ్చాయి. అదే వాహనంలో సాధారణ కాన్పు పొంది ఆడపిల్లకు వాణిదేవి జన్మనిచ్చింది.
ఈ విషయాన్ని వాణీదేవి భర్త ముఖేష్... తన గుత్తేదారు చెన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న గుత్తేదారు.. తల్లీబిడ్డలను తన కారులో స్థానిక పీహెచ్‌సీకి తరలించాడు. సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల.. తొర్రూరులోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడా అదే పరిస్థితి నెలకొనగా.. కాజీపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం.. వారిని రైలులో బిహార్ పంపించారు.