ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

కొవిడ్‌తో వాసన కోల్పోయారా..? ఇలా ప్రయత్నించండి! - సహజ ప్రక్రియల ద్వారా చికిత్స

కరోనా వైరస్‌ సోకిన వారిలో అనేకమంది వాసన కోల్పోతున్న విషయం తెలిసిందే. ఇలాంటివారు కొన్ని రకాల మందులను వాడడం ద్వారా మళ్లీ వాసన పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, స్టెరాయిడ్లు వాడడం మంచిది కాదని.. కొన్ని సహజ ప్రక్రియల ద్వారా వాసన సమస్యను అధిగమించవచ్చని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేస్తోంది.

కొవిడ్‌తో వాసన కోల్పోయారా..? ఇలా ప్రయత్నించండి!
కొవిడ్‌తో వాసన కోల్పోయారా..? ఇలా ప్రయత్నించండి!

By

Published : Apr 28, 2021, 10:19 AM IST

కొవిడ్ లక్షణాల్లో వాసన కోల్పోవడం కూడా ఒకటని ఇప్పటికే నిపుణులు గుర్తించారు. అయితే, కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా తిరిగి వాసన గుర్తించడం కష్టమవుతోందని పలువురు బాధితులు వైద్యులను సంప్రదిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కార్టికో స్టెరాయిడ్లను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టెరాయిడ్ల ప్రభావాన్ని తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లియా (యూఈఏ)తో పాటు అంతర్జాతీయ నిపుణులు బృందం ఓ అధ్యయనం చేపట్టింది. తద్వారా కార్టికో స్టెరాయిడ్లు వాడడం వల్ల కేవలం స్వల్ప ప్రయోజనం మాత్రమే ఉంటుందని నిపుణుల బృందం గుర్తించింది. వాసన తిరిగి పొందేందుకు ఇలాంటి మందులను వినియోగించకూడదని యూఈఏకు చెందిన ప్రొఫెసర్‌ కార్ల్‌ ఫిల్‌పాట్‌ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్న వేళ.. వీటి చికిత్సకు కూడా భారీ డిమాండ్ ఏర్పడిందన్నారు.

ఐదుగురిలో ఒకరికి లక్షణం

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ బారినపడుతున్న ప్రతి ఐదుగురిలో ఒకరికి వాసన కోల్పోయే లక్షణం ఉంటున్నట్లు అంచనా. అయితే, దాదాపు 90 శాతం మంది పూర్తిగా వాసన సమస్య నుంచి బయటపడుతున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. కానీ, కొందరిలో కొవిడ్‌ నుంచి కోలుకున్నప్పటికీ ఎనిమిది వారాలైనా తిరిగి వాసనను పసిగట్టే లక్షణం పొందలేకపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

'స్మెల్‌ ట్రెయినింగ్‌’తో ప్రయోజనం..

ఎలాంటి మందులు వాడకుండానే ఈ సమస్య నుంచి బయటపడేందుకు 'స్మెల్‌ ట్రెయినింగ్‌' ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు వేర్వేరు వాసనలు కలిగిన నాలుగు పదార్థాలను రోజుకు రెండుసార్లు పీల్చుకోవాలని చెబుతున్నారు. తద్వారా మెదడుకు సంబంధించి తనకు తానే పునర్వవస్థీకరించుకునే (న్యూరోప్లాస్టిసిటీ) సామర్థ్యాన్ని పొందుతుందని పేర్కొన్నారు. కరోనా నుంచే కాకుండా వివిధ కారణాల వల్ల వాసన కోల్పోయిన వారికి చౌకగా, తేలికైన మార్గంలో ఎలాంటి దుష్ప్రభావాలు లేని చికిత్స అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కొన్నిరకాలైన స్టెరాయిడ్లు

శరీరంలో సంభవించే వాపులను తగ్గించేందుకు కొన్నిరకాలైన కార్టికో స్టెరాయిడ్లను వినియోగిస్తారు. అస్తమా వంటి సమస్యలకు వినియోగించే ఈ మందులను వాసన కోల్పోతున్నవారికి కొందరు వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అయితే, వీటి వల్ల అధిక రక్తపోటు, మానసిక, శారీరక ప్రవర్తనలో మార్పుల వంటి దుష్ప్రభావాలు కూడా కలుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే సహజంగా ‘స్మెల్‌ ట్రెయినింగ్‌’తో వాసన సమస్యలను అధిగమించవచ్చని అంతర్జాతీయ నిపుణుల బృందం సూచించింది.

ఇదీ చూడండి :వాట్సాప్​ మెసేజ్​లు ఇక 24 గంటల్లో మాయం!

ABOUT THE AUTHOR

...view details