శక్తి లేనిదే సృష్టి లేదు. ఆ ఆదిపరాశక్తిని పూజించే పండుగే దసరా. మిగిలిన పండుగలకు కొన్ని ప్రాంతాల్లో బాగా ప్రాధాన్యత ఇస్తే, కొన్ని ప్రాంతాల్లో కాస్త తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. కానీ శరన్నవరాత్రులను మాత్రం దేశం మొత్తం ఘనంగా జరుపుకుంటుంది. పండుగకు ముందే ఇల్లు శుభ్రం చేసుకోవడం, పిండి వంటలు చెయ్యడంతో పాటు దసరా రోజు వేసుకునేందుకు కొత్త బట్టలూ కొనుక్కుంటారు. ఒకప్పుడైతే పండుగ అనగానే సంప్రదాయ వేడుక కాబట్టి అమ్మలకు పట్టు చీర లేదంటే సంప్రదాయంగా కనిపించే ఫ్యాన్సీ చీరలూ, అమ్మాయిలకు పరికిణీ ఓణీలూ మగవాళ్లూ పిల్లలకు పంచెలూ పైజమా సల్వార్‌లూ కొనేసేవారు. కానీ ఇవి సెల్ఫీలూ వాట్సాప్ స్టేటస్‌లూ ఫేస్‌బుక్‌లూ రాజ్యం ఏలుతున్న రోజులు.
పుట్టిన రోజూ పెళ్లి వేడుకల్లాంటి వాటినే కాదు, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అన్నట్లూ ఇంట్లో జరిగే కుంకుమ పూజని కూడా ఫొటోల్లో బంధించి సోషల్ మీడియాలో పంచుకోవడం ఓ తంతైపోయింది. కాబట్టే, దుస్తుల విషయంలోనూ సంప్రదాయమైనా సరికొత్తగా ఉండాలన్న సూత్రాన్ని ఈతరం వ్రతంలా ఆచరిస్తోంది. వారి వ్రతానికి భంగం కలగకుండా డిజైనర్లూ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్లను సృష్టించేస్తున్నారు. అలా దసరా వేడుకల కోసం దిగివచ్చిందే దుర్గమ్మ ఫ్యాషన్.