జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని పోతారంలో ఓ యువకుడు ప్రేమించి మోసగించాడని సూసైడ్ నోట్ రాసి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన కొత్తపల్లి లక్ష్మి, సత్తయ్యలకు నలుగురు కుమార్తెలు. ముగ్గురికి వివాహం కాగా నాలుగో కుమార్తె ఉమ ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటోంది.
ఇదే గ్రామానికి చెందిన మడ్డి రంజిత్, ఉమ ఇంటర్ నుంచి ప్రేమించుకుంటున్నారు. ఉమకు ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తుంటే రంజిత్‌ను ప్రేమించానని... అతనినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. సరే అన్న ఉమ కుటుంబ సభ్యులు... రంజిత్‌ను రెండేళ్లుగా వివాహం చేసుకోవాల్సిందిగా అడుగుతున్నారు. యువకుడు మాత్రం వారి మాటలను దాటవేస్తున్నాడు. వేరే సంబంధాలను చూస్తే చెడగొడుతూ, చేసుకుంటే నన్నే చేసుకోవాలని, లేకుంటే చనిపోవాలంటూ ఆమెను బెదిరించసాగాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
సూసైడ్ నోట్..
మనస్థాపం చెందిన ఉమ ఈ నెల 20న రాత్రి ఇంటి వెనక గుడిసెలో పురుగుల మందు తాగింది. అనంతరం ఇంట్లోకి వచ్చి వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను తొలుత జగిత్యాలకు, అనంతరం కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా బుధవారం మృతి చెందింది.