పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లిలో నడిరోడ్డుపై లేగదూడను ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఒక్కసారిగా రోడ్డు పై పడిపోయిన లేగదూడ అరుపులకు దూరంగా ఉన్న తల్లి పరుగు పరుగున వచ్చింది. ఇతర వాహనాలు రాకుండా అడ్డంగా నిలబడింది. కాలు విరిగి అల్లాడుతున్న దూడను చూసి తల్లడిల్లింది. దూడ కాలు విరిగిన పరిస్థితికి... ఆ తల్లి కంటతడి పెట్టింది. నడిరోడ్డుపై ఈ ఘటన అందరి మనసులను కలచివేసింది.
కొంతమంది వెంటనే స్పందించి ఆ లేగదూడను నీడకు చేర్చారు. లేగదూడను తల్లి, మరొక గేదె విడవకుండా ఉండిపోయాయి. స్థానికులు ప్రథమ చికిత్స చేసి వైద్యులకు సమాచారం అందించారు. పాలకోడేరు మండలంలో నిబంధనలకు విరుద్ధంగా మితిమీరిన వేగంతో మట్టి ట్రాక్టర్లు ప్రయాణిస్తున్న కారణంగానే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న వాహనాల పై చర్యలు తీసుకోవాలని వాహనదారులు, పాదచారులు కోరుతున్నారు.