విశాఖపట్నం నకిలీ నోట్ల కేసులో విజయవాడలోని ఎన్.ఐ.ఎ. ప్రత్యేక న్యాయస్థానంలో మూడో ఛార్జిషీటు దాఖలు చేసినట్లు ఎన్.ఐ.ఎ. అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్దా ప్రాంతానికి చెందిన ఎనముల్ హక్‌ను ఎన్.ఐ.ఎ. ప్రస్తుత సంవత్సరం సెప్టెంబరు 3న అరెస్ట్ చేసిన నేపథ్యంలో తాజా ఛార్జిషీట్‌ను దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఎనముల్ హక్ బంగ్లాదేశ్‌లోని కొందరి నుంచి నకిలీ కరెన్సీ నోట్లను తీసుకొచ్చి భారత్‌లో చలామణి చేస్తున్నాడని తేలిందన్నారు. నకిలీ కరెన్సీ నోట్ల కేసులో ఇప్పటికే అరెస్టైన మొహ్మద్ మహబూబ్‌బేగ్, సయద్ ఇమ్రాన్, ఫిరోజ్ షేక్ అలియాస్ సద్దాం, తాజముల్‌షేక్ అలియాస్ భూత్‌లతో కుట్రకు పాల్పడి రూ.10.20 లక్షలు సంపాదించి వాటిని చలామణి చేసే బాధ్యతను మహబూబ్‌బేగ్ అలియాస్ అజార్‌బేగ్, సయద్ ఇమ్రాన్‌లకు అప్పగించినట్లు సీబీఐ విచారణలో వెల్లడైంది.
మహబూబ్‌బేగ్, సయద్ ఇమ్రాన్‌లు హౌరా హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా విశాఖ డీఆర్‌ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్) అధికారులు దాడి చేసి వారి నుంచి 10.20లక్షల విలువైన నకిలీనోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసులో ఎన్.ఐ.ఎ. అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆధారంగా న్యాయస్థానం వారిద్దరికీ పదేళ్ల కఠిన కారాగార శిక్షను, రూ.10వేల జరిమానాను విధించింది. మరో ఇద్దరు నిందితులు ఫిరోజ్‌షేక్(మాల్దా, పశ్చిమబెంగాల్), తాజముల్‌షేక్(తూర్పు చంపారన్, బిహార్)లపై ఇప్పటికే ఛార్జిషీటు దాఖలైంది. కేసులో భాగస్వాములైన బంగ్లాదేశీయుల పాత్రపై విచారణ కొనసాగుతున్నట్లు ఎన్.ఐ.ఎ. అధికారులు వెల్లడించారు.