ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో కొందరు ఇదే అదునుగా సొమ్ము చేసుకుంటున్నారు. వివిధ మార్గాల్లో తెలంగాణ నుంచి మద్యాన్ని తరలిస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సాలార్జంగ్పేట వద్ద తవుడు బస్తాల మధ్య రూ.1,34,800 విలువ చేసే మద్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. తెలంగాణలో తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి ఆంధ్రాలో అధిక ధరకు మద్యం అమ్మాలనే ఆశతో పలువురు మద్యంను సరిహద్దులు దాటిస్తున్నారు.
మద్యం తరలిస్తున్న డీసీఎం, 1,150 మందు సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గిరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా తవుడు బస్తాల కింద మద్యం బస్తాలు పెట్టి తరలిస్తున్నారు. గతంలో ఇదే తరహాలో శనక్కాయల కింద సుమారు 2 లక్షల విలువైన మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.