కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై రామారావు, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై మురళి కృష్ణ.. తమ బృందంతో కలిసి పట్టణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
చికెన్ సెంటర్ యజమాని ఆధ్వర్యంలో..
బస్టాండ్ సమీపంలోని బాబు చికెన్ సెంటర్ యజమాని బాబు పెద్ద మొత్తంలో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఐదుగురిని కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి 6 వేల రూపాయలు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
బెట్టింగ్‌ల కోసమే 3 అకౌంట్లు..
పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాల వద్ద నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద మారగాని వేణుగోపాల అనే వ్యక్తి నేతృత్వంలో.. కేవలం బెట్టింగ్‌ల కోసమే మూడు ఖాతాలు ఓపెన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పేటీఎం, గూగుల్ పే ద్వారా నగదు బదిలీలు జరుగుతున్నట్లు తేల్చారు. వారి నుంచి 8 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 16 మంది..
మొత్తంగా పట్టణంలో 16 మంది బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తులను, 9 సెల్‌ఫోన్లలు, రూ. 14, 200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్నట్లు డీఎస్పీ రమణమూర్తి వివరించారు.
ఇవీ చూడండి:
వసతుల లేమే శాపం.. మిగిల్చింది గర్భశోకం