వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన వృద్ధ దంపతులు హుస్సేన్, యూకూబీలను కన్న కుమారులు ఇంటి నుంచి గెంటేశారు. తమ ఐదుగురు పిల్లలకు ఆ వృద్ధ దంపతులు తమ ఆస్తిని పంచి ఇచ్చేశారు. చనిపోయిన నాలుగో కుమారుడి ఇంట్లోనే ఉంటూ పింఛను సొమ్ముతో జీవనం సాగించారు.
పెద్ద కుమారుడికి ఎక్కువ ఆస్తి ఇచ్చారని ఆరోపిస్తూ మిగిలిన వారు.. తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకొని వారిని ఇంట్లోంచి బయటకు గెంటేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారికి బస్టాపే నివాసమైంది. రెండు రోజులుగా అక్కడే ఉన్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని కుమారులను మందలించగా... తల్లిదండ్రులను ఇంటికి తీసుకువెళ్లారు.