బతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చిన తనను కొందరు భయపెట్టి.. బలాత్కరించారని.. తొమ్మిదేళ్లలో 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఓ మహిళ ఆరోపించింది. ఈ విషయమై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. తనపై అఘాయిత్యానికి పాల్పడ్డ వారంతా చంపేస్తానంటూ బెదిరించడంతో ప్రాణభయంతో మౌనంగా ఉన్నానని, సోమాజిగూడలోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థ సాయంతో ఫిర్యాదు చేస్తున్నానని పోలీసులకు వివరించింది.
చదువుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చి..
తొమ్మిదేళ్ల క్రితం తనకు వివాహమైందని, ఏడాదికే విడాకులు తీసుకున్నానని పేర్కొంది. అనంతరం తాను చదువుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చానని తెలిపింది. కొద్దిరోజుల తర్వాత ఓ వసతి గృహానికి వెళ్లగా.. అక్కడికి వచ్చిన సుమన్ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో అతని వద్దకు వెళ్లానని.. అక్కడ తనను బలాత్కారం చేశారని వాపోయింది. అప్పటి నుంచి అతని స్నేహితులు సైతం సామూహిక అత్యాచారం చేశారని తెలిపింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వారిలో కొందరు సినీనటులు, మాజీ ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకుడు ఉన్నారని ఆరోపించింది.