'వాళ్లు' ఎంతమంది ఓటేశారంటే..? - 2019 elections
వారిని సమాజంలో చాలామంది చులకనగా చూస్తారేమో..! అవేవీ పట్టించుకోరు.. ధైర్యంగా ఎన్నికల బరిలో నిలుచుంటారు! వారి హక్కుల కోసం పోరాడతారు...ఓటింగ్లో పాల్గొని...ఓటేయమంటూ ఇంట్లో కూర్చునే వారికి ఆదర్శంగా నిలుస్తారు. వారే ట్రాన్స్ జెండర్లు... ఈసారి ఆంధ్రా ఎన్నికల్లో వారి ఓటింగ్ శాతం పెరిగింది.
ఓటేయమంటే... చాలామంది నుంచి ఎందుకు..అనే ఎదురు ప్రశ్న. బాధ్యతాయుతమైన ఓటును వినియోగించుకునేందుకు ముందుకురారు. అదే ట్రాన్స్ జెండర్లు మాత్రం అందుకు భిన్నం. సమాజం వారిని చూసే తీరు వేరైనా...తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2014 ఎన్నికల్లో తక్కువ మంది ట్రాన్స్ జెండర్లు ఓటేశారు. ఈసారి మాత్రం ఆ సంఖ్య పెరిగింది.
కాకినాడలో 62 మంది...
2014 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మెుత్తం 157 మంది ట్రాన్స్ జెండర్లు ఓటేశారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఈ సంఖ్య 661కి చేరింది. వారిలోనూ చైతన్యం పెరుగుతోంది. కిందటిసారి 3 వేల 187 ట్రాన్స్ జెండర్ల ఓట్లు ఉంటే...ఈసారి 3 వేల 957 ఓట్లున్నాయి. కాకినాడ సిటి నియోజకవర్గంలో అధికంగా ఓటేశారు. ఇక్కడ 142 ట్రాన్స్ జెండర్ ఓట్లు ఉంటే...62 ఓట్లు పోలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఒకే ట్రాన్స్ జెండర్ ఓటు ఉండగా..ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్నారు.
పోటీలో మంగళగిరి తమన్నా...
గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి పోటీ చేశారు. స్వార్థపూరిత రాజకీయాలను విముక్తి చేసేందుకే పోటీ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. నాలుగు గోడలకు పరిమితం కాకుండా....తమ హక్కుల కోసం పోరాడేందుకు ఎన్నికల బరిలో ఉన్నట్లు ఆమె తెలిపారు. ట్రాన్స్ జెండర్ల సమస్యలు పరిష్కరించి..వారికి ఉపాధి కల్పించేందుకే ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నట్లు నామినేషన్ వేసే సమయంలో తమన్నా తెలిపారు.