ARREST: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెల్దుర్తిపాడులో విద్యార్థినులను వేధిస్తున్న ఇద్దరు యువకులకు గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కొంతకాలంగా విద్యార్థినులను వేధింపులకు గురి చేస్తున్నారు. బుధవారం కళాశాల నుంచి.. ఆటోలో గ్రామానికి తిరిగి వస్తున్న బాలికలను అడ్డగించి వేధించారు. ఈ విషయాన్ని బాలికలు వారి తల్లిదండ్రులకు తెలిపారు. రాత్రి 10గంటల సమయంలో యువకులిద్దరిని పిలిపించి.. జరిగిన విషయంపై ఆరా తీశారు. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు యువకులకు దేహశుద్ధి చేశారు.
గ్రామంలో గొడవ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడి వెళ్లారు. ఇద్దరు యువకులను వేరే వాహనంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అనంతరం బాలికలు వేధింపులకు గురి చేసిన యువకులపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. యువకులు వేధించిన ప్రదేశం నందిగామ మండల పరిధిలోకి రావడంతో కేసును నందిగామ పోలీసులకు అప్పగించారు. వేధించిన యువకులను నందిగామ స్టేషన్‌కు తరలించారు. ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.