TDP leader Chennupati Gandhi Case: తెదేపా రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై వైకాపా నేతల దాడి కేసులో పోలీసుల తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. నిందితుల రిమాండు విషయంలో పకడ్బందీగా వ్యవహరించడంలో విఫలమయ్యారు. గాయానికి సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించని కారణంగా రిమాండ్ తిరస్కరణకు గురైంది. అనంతరం కేసులో ముగ్గురు నిందితులకు బుధవారం రాత్రి 9 గంటల సమయంలో పటమట పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు.
అంతకుముందు ఫిర్యాదులో పేర్కొన్న వైకాపా నేత ఈశ్వర్‌ప్రసాద్ పేరును రిమాండ్ నివేదికలో లేకుండా చేశారు. ఈ స్థానంలో కొత్తగా మరొకరి పేరు చేర్చారు. ఈ కేసులో నిందితులను పోలీసులు బుధవారం సాయంత్రం విజయవాడ నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయస్థానం జడ్జి బిందుమాధవి ఎదుట హాజరుపరిచారు. గద్దె కల్యాణ్, లీలా కృష్ణప్రసాద్, సుబ్బులను నిందితులుగా చూపించారు. వారి తరఫున న్యాయవాది కిలారు బెనర్జీ వాదనలు వినిపిస్తూ... తీవ్ర గాయమైతేనే సెక్షన్ 326 చేర్చాలని, అసలు గాయం తీవ్రతను తెలిపే నివేదికనే పోలీసులు సమర్పించలేదన్నారు.
అందుకే 41ఏ సీఆర్‌పీసీ నోటీసు ఇవ్వాలని, రిమాండ్‌ను తిప్పిపంపాలని కోరారు. అనంతరం ఇన్‌ఛార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉమావతి తన వాదనలు వినిపిస్తూ... బాధితుడు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, గాయంపై నివేదిక ఇంకా రాలేదన్నారు. ఈ పరిస్థితుల్లో నిందితులను రిమాండ్ చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి బిందుమాధవి... గాయంపై వైద్యుల నివేదిక పొందుపర్చని కారణంగా సెక్షన్ 326ను పరిగణనలోకి తీసుకోలేమన్నారు. నిందితులకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేయాలని పేర్కొంటూ రిమాండ్‌ను తిప్పి పంపారు. దాంతో నిందితులను పటమట ఠాణాకు తరలించిన పోలీసులు రాత్రి 9 గంటలకు బెయిల్ ఇచ్చేశారు.
ఆలస్యంగా చేరిన రిమాండ్ రిపోర్టు
కోర్టు పనివేళలు ముగిసే సమయంలో పోలీసులు నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. రిమాండ్ రిపోర్టు లేకుండానే వచ్చారు. న్యాయమూర్తి రిపోర్టు గురించి ప్రశ్నించగా... నివేదిక వస్తోందంటూ 15 నిమిషాలపాటు కాలయాపన చేశారు. దీనిపై న్యాయమూర్తి కొంత అసహనం వ్యక్తంచేశారు.
ఈశ్వర్ ప్రసాద్ పేరు తప్పించారా?
తనపై జరిగిన హత్యాయత్నంలో చెన్నుపాటి గాంధీ ముగ్గురు పేర్లను పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించారు. వీరితోపాటు మరో నలుగురు ఉన్నారన్నారు. దీని ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా గద్దె కల్యాణ్, ఏ2గా సుబ్బు, ఏ3గా వల్లూరి ఈశ్వర్‌ప్రసాద్‌ల పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు. కానీ... వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే సమయంలో పేర్లు తారుమారయ్యాయి. వల్లూరి ఈశ్వర్‌ప్రసాద్ పేరును తప్పించేశారు. ఆయనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, ఆధారాలు లభించలేదని పోలీసులు తప్పించుకుంటున్నారు. రిమాండ్ నివేదికలో ఏ1గా గద్దె కల్యాణ్, ఏ2గా తమ్మిశెట్టి లీలాకృష్ణ, ఏ3గా సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు పేర్లను చేర్చారు. కొత్తగా రాణిగారి తోటకు చెందిన లీలాకృష్ణ ప్రసాద్ పేరు వచ్చి చేరింది. ఏ4గా కానూరి బాబును చేర్చారు. అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అసలేం జరిగింది: తెదేపా రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై వైకాపా నేతలు హత్యాప్రయత్నం చేయడంతో.. బెజవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో మళ్లీ రౌడీయిజానికి ఆజ్యం పోసేలా వైకాపా వ్యవహరించిన తీరు స్థానికులను సైతం కలవరపరుస్తోంది. గాంధీ కుడికన్ను పూర్తిగా దెబ్బతినడంతో మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. గాంధీపై దాడిని తెలుగుదేశం నేతలు ఖండించారు.
తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై వైకాపా నేతలు మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసేందుకు యత్నించడం కలకలం రేపింది. విజయవాడలో కార్పొరేటర్‌గా గాంధీ 4 సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో 9డివిజనుకు ఆయన భార్య కాంతిశ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిన్న సాయంత్రం 9వ డివిజన్‌లో పైపులైను లీకేజీపై ఫిర్యాదులు అందితే ...దగ్గరుండి కార్పొరేషన్ సిబ్బందితో ఆయన పనులు చేయిస్తుండగా.. కొంతమంది వైకాపా నేతలు అక్కడికి చేరుకున్నారు.
తమ ప్రభుత్వం హయాంలో నీ పెత్తనమేంటంటూ వాగ్వాదానికి దిగారు. ఆ డివిజన్‌కే చెందిన వైకాపా అధ్యక్షుడు గద్దె కళ్యాణ్, వైకాపా ఇంఛార్జ్ వల్లూరి ఈశ్వరప్రసాద్, కార్యకర్త సుబ్బుతో పాటు మరో నలుగురు ఒక్కసారిగా గాంధీపై దాడి చేశారు. ముష్టి ఘాతాలు కురిపించారు. ఇనుప చువ్వతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. దీంతో అతని కుడికన్ను దెబ్బతింది. స్థానికులు అడ్డుపడటంతో అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. చెన్నుపాటి గాంధీని ద్విచక్రవాహనంపై తాడిగడపలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. ఆయన్ను తెదేపా నేతలు పరామర్శించారు. వైకాపా దాడిని తీవ్రంగా ఖండించారు.
ప్రణాళికా ప్రకారమే చెన్నుపాటి గాంధీపై దాడి చేసినట్లు తెలుగుదేశం ఆరోపిస్తోంది. పటమటలంక తెలుగు యువత ఆధ్వర్యంలో వినాయక చవిత ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. గతంలో అంతా కలిసి వేడుకలు చేసుకునేవారు. ఈ మధ్య పార్టీలు మారడంతో రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలో చవితి వేడుకలు తెదేపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీన్ని మనసులో పెట్టుకుని మద్యం మత్తులో కావాలని గొడవ పడ్డారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. డివిజన్‌లో చురుగ్గా వ్యవహరిస్తుండడంతో రాజకీయ కక్షతో దాడి చేశారనే మండిపడుతున్నారు.
ఇవీ చదవండి: