తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన డ్రగ్ కేసులో (Tollywood Drugs Case) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మిని సుదీర్ఘంగా విచారించిన ఈడీ(ED) అధికారులు.. ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సింగ్‌ను (Rakul preet singh) ప్రశ్నించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ దాదాపు 6 గంటల పాటు సాగింది.
అందులో రకుల్ పేరు లేదు
మనీ లాండరింగ్ కోణంలో రకుల్ బ్యాంక్ ఖాతాలను ఈడీ అధికారులు పరిశీలించారు. అనుమానాస్పద లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. డ్రగ్ కేసులో సిట్ విచారణ పరంగానే ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే సిట్ దర్యాప్తులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు లేదు. ఎఫ్ క్లబ్ నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లు కెల్వీన్ ఇచ్చిన సమాచారంతో రకుల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
మేనేజర్‌ను ప్రశ్నించిన ఈడీ
2016లో ఎఫ్ క్లబ్లో నిర్వహించిన ఓ పార్టీలో రకుల్ పాల్గొన్నారు. ఆ పార్టీలో కెల్విన్ డ్రగ్ సరఫరా చేశాడు. ఈ క్రమంలో విదేశాలకు డబ్బును తరలించినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. కెల్విన్ నుంచి ప్రాథమికంగా సేకరించిన సమాచారం కోణంలోనే దర్యాప్తు కొనసాగింది. ఆ పార్టీలో రకుల్ మేనేజర్ కూడా పాల్గొనడంతో... ఆయన్ని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు.