కృష్ణా జిల్లా ముదినేపల్లి పోలరాజు కాలువలో గల్లంతైన బాలుడు నాగచైతన్య మృతదేహాన్ని ప్రత్యేక బృందాలు గుర్తించాయి. కాలువ గట్టుపై ఆడుకుంటుండగా, ప్రమాదవశాత్తు కాలువలో జారి పడిన నాగ చైతన్య విగత జీవుడై బయటకు వచ్చాడు. ప్రత్యేక బృందాల ద్వారా రెండు గంటల పాటు అధికార యంత్రాంగం చేసిన కృషి ఫలించి గుర్రపు డెక్క కింద నాగ చైతన్య మృతదేహం లభ్యమైంది. మృతుడి భౌతికకాయాన్ని చూసిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బోరుమంటూ విలపిస్తున్నారు. కళ్ళముందు ఆడుకుంటూ తిరిగే బాలుడి మృతిని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇదీ జరిగింది...
కృష్ణా జిల్లా ముదినేపల్లి గ్రామానికి చెందిన నాగ చైతన్య అతని తమ్ముడు వరుణ్ తేజతో కలిసి పొలరాజు కాలువ గట్టుపై ఆడుకుంటుండగా, ప్రమాదవశాత్తు కాల్వలో జారి పడ్డాడు. కాలువలో అధిక స్థాయిలో పేరుకుపోయిన గుర్రపు డెక్క కింద ఉన్న నీటి ప్రవాహానికి బాలుడు కొట్టుకుపోగా,స్థానికులు ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు. ప్రత్యేక బృందాల ద్వారా పోలరాజు కాలువలో అధికారులు వెతుకులాట ప్రారంభించారు.
భార్య గొంతుకోసి చంపిన భర్త....
విభేదాల కారణంగా భార్యను గొంతు కోసి ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు ఓ భర్త. ఈ ఘటన విజయవాడ గవర్నర్‌పేటలో జరిగింది. కంచికచర్ల గ్రామానికి చెందిన అమ్మాయితో కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కొన్ని విభేదాల కారణంతో విడిగా ఉంటున్నారు. ఆదివారం రాత్రి సుమారు పది గంటలకు ప్రసాద్ అనే వ్యక్తి అతని భార్యతో కలిసి పాత బస్టాండ్ ఎదురుగా గల అశోకా రెసిడెన్సి లాడ్జ్‌లో ఒక గది తీసుకున్నాడు. రాత్రి రెండు గంటలకు బయటికి వెళ్లి జ్యూస్ తీసుకొని వచ్చి ఇచ్చి మళ్లీ బయటకి వెళ్లి తిరిగి రాలేదు. లాడ్జిలోని వారికి అనుమానం వచ్చి రూమ్ దగ్గరకు వెళ్లి చూడగా డోరు తాళం వేయలేదు. సదరు ప్రసాద్‌కు ఫోన్ చేయగా బయటకి వెళ్లానని, ఇప్పుడే వస్తానని చెప్పినట్లు తెలిపారు. అశోక్ లాడ్జి సిబ్బంది గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గవర్నర్‌పేట పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఎస్బీఐ సేవా కేంద్రం నిర్వాహకుడు ఆత్మహత్య
అనంతపురం జిల్లా మడకశిర మండలం కల్లుమరి గ్రామంలో ఎస్బీఐ సేవా కేంద్రం నిర్వాహకుడు రమేష్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను చేసిన మోసాలన్నీ గ్రామంలో తెలియడంతో తీవ్ర మనస్థాపానికి గురై భార్యను బంధువుల ఇంటికి పంపించి ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. సంఘటన స్థలంలో అతను రాసుకున్న ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్య ఫిర్యాదు మేరకు సీఐ శ్రీరామ్, ఎస్ఐ శేషగిరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.