TODAY CRIME NEWS in AP: రాష్ట్రంలో పలుచోట్ల ప్రమాదాలు వెలుగుచూశాయి.వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఆరుగురు మరణించారు.
గ్యాస్ రీఫిల్లింగ్ దుకాణంలో అగ్నిప్రమాదం...
కడప చిన్న చౌక్ పరిధిలోని నెహ్రూ నగర్ వద్ద రాత్రి అనధికారికంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో దుకాణ నిర్వాహకుడు కాళ్ళకు తీవ్రగాయాలయ్యాయి. మహేష్ అనే వ్యక్తి అనధికారికంగా గ్యాస్ సిలిండర్లకు గ్యాస్ రీఫిలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో మంటలు అంటుకోవడంతో దుకాణం మొత్తం మంటలు వ్యాపించాయి. మహేష్ భయంతో పరుగులు తీశారు. అప్పటికే అతని కాళ్ళకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో చుట్టుపక్కలవారు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే దుకాణంలో పలు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇలా అనధికారికంగా గ్యాస్ రీఫిలింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నా... పోలీసులు గాని, రెవెన్యూ అధికారులు గాని చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు.
ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొన్న లారీ..యువకుడు మృతి...
ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం తిమ్మన పాలెం జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి లారీ బలంగా ఢీట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న మేదరమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడు తమ్మవరం గ్రామానికి చెందిన బట్టు శ్రీకాంత్ గా గుర్తించారు. మృతుడు తమ్మవరం నుంచి గ్రోత్ సెంటర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్థరించారు.ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్..వాహనాన్ని వదిలి పెట్టి పరారయ్యాడు.
భక్తులపై దూసుకెళ్లిన బైక్...మహిళ మృతి...
విజయవాడ నగర శివారు కొత్తూరు తాడేపల్లి వద్ద ద్విచక్రవాహనం బీభత్సం సృష్టించింది. కాలినడకన దుర్గగుడికి వెళుతున్న భక్తులపైకి వాహనం దూసుకెళ్లడంతో ఓ మహిళ మృతి చెందింది. మరొకరికి గాయాలయ్యాయి. ద్విచక్రవాహన దారుడు మద్యం మత్తులో వాహనం నడుపుతున్నాడని స్థానికులు చెపుతున్నారు. మృతురాలు మైలవరం మండలం బొర్రగూడెం గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు.
భార్య పై భర్త హత్యాయత్నం...
అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని ఉయ్యాలకుంట కాలనీలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య వీరనారమ్మను భర్త రమణ అతి కిరాతకంగా పొడిచాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన మహిళను తమ వాహనంలోనే ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నారి మృతదేహం లభ్యం
ప్రకాశం జిల్లా గుంటుపల్లిలో అప్పుల బాధతో ఇద్దరు చిన్నారులతో సహా తండ్రి అద్దంకి బ్రాంచ్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో... నేడు చిన్నారి నేడు చిన్నారి చైతన్య కృష్ణ (9) మృతదేహం మార్టూరు మండలం ఇసుక దర్శి సమీపంలోని అద్దంకి బ్రాంచ్ కాలవలో లభ్యమైంది. నిన్నటి వరకు తండ్రి చిరంజీవి(36), చిన్నారి సాయి సౌమ్య(8) మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మేనల్లుడు మృతి
ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మేనల్లుడు లోకేశ్ మృతి చెందాడు. కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎమ్మెల్యే మేనల్లుడు మరణించాడు. ఈనెల ఒకటో తేదీన ఐ.పోలవరం మండలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఎమ్మెల్యే కుమారుడు సుమంత్ కోలుకుంటుండగా.. లోకేశ్ తుది శ్వాస విడిచాడు.