చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసిన దారుణంలో రాజు ఒక్కడిదే పాత్ర అని ఇప్పటివరకు ఉన్న ఆధారాలను బట్టి పోలీసులు నిర్ధారణకు వస్తున్నారు. ఈనేపథ్యంలో కేసును మూసేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే సాంకేతికంగా అందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు రెండు అంశాలు కీలకం కానున్నాయి. ఒకటి మృతదేహం రాజుదే అని సాంకేతికంగా రుజువు చేయడం. రెండోది హత్యాచారం చేసింది రాజే అని నిరూపించడం.
మృతదేహం రాజుదే అనేందుకు డీఎన్‌ఏ నమూనాను విశ్లేషించనున్నారు. రక్త సంబంధీకుల డీఎన్‌ఏతో పోల్చి నిర్ధారించనున్నారు. మరోవైపు ఘటనాస్థలి నుంచి చిన్నారి దుస్తుల్ని క్లూస్ బృందాలు స్వాధీనం చేసుకున్న దృష్ట్యా వాటిపై నిందితుడి సెమన్(వీర్యం) నమూనాల్ని సేకరించినట్లుగా చెబుతున్నారు. అది రాజుదే అని నిరూపించగలిగితేనే ఈ కేసులో అతనే నిందితుడు అని సాంకేతికంగా నిర్ధారణ అవుతుంది. అటు డీఎన్‌ఏ.. ఇటు వీర్య నమూనాల విశ్లేషణ అంతా ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదికలతో ముడిపడి ఉంది. ఎఫ్‌ఎస్‌ఎల్ నుంచి ఆ రెండు నివేదికలు అందిన తర్వాత న్యాయస్థానంలో వాటిని సమర్పించిన తర్వాతే కేసు ముగియనుంది.