Tarnaka Family Suicide Case Update: పసితనం నుంచి గారాబంగా పెరిగాడు. మాట నెగ్గకుంటే అలగడం, కోప్పడటం, ఒంటరిగా ఉండటంతో పంతం నెరవేర్చుకునేవాడంటున్నారు బంధువులు. చదువు పూర్తయి ఉన్నత కొలువు చేపట్టినా పద్ధతి మారలేదు. పెళ్లయ్యాక అదే ఆవేశం కన్నతల్లి, భార్య, కుమార్తెలను చంపేంత కసాయిగా మార్చిందంటున్నారు. తార్నాక రూపాలి అపార్ట్‌మెంట్‌లో సోమవారం విజయ్‌ప్రతాప్(33), సింధూర(32) దంపతులు, కుమార్తె ఆద్య(4), ప్రతాప్ తల్లి జయతి(65) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అంచనాకొచ్చారు.
మంగళవారం నాలుగు మృతదేహాలకు గాంధీలో పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. సింధూర కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తిచేశారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా మరణాలకు కారణం తెలుస్తుందని ఓయూ ఇన్‌స్పెక్టర్ రమేష్‌నాయక్ తెలిపారు. విజయ్ ప్రతాప్ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. పసితనంలో మరణించాడు. ఒక్కడే కుమారుడు కావటంతో తల్లి జయతి అల్లారుముద్దుగా పెంచింది. ఏది కోరినా క్షణాలో అమర్చేది. ఇల్లు, చదువు ఇవే అతడి లోకం. స్నేహితులు, బంధువులకు దూరంగా పెరిగాడు. కన్నతల్లి ఆశించినట్టే బాగా చదివాడు.
Family suicide in Tarnaka Rupali apartment: చెన్నైలోని ప్రముఖ కార్ల కంపెనీలో డిజైనర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం దగ్గరి బంధువు సింధూరతో వివాహమైంది. తన మాటే నెగ్గాలనే పంతంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. వేధింపులు ఎక్కువ కావటంతో రెండేళ్ల క్రితం భార్య సింధూర, కుమార్తె ఆద్య, తల్లి జయతి నగరం చేరారు. తార్నాకలోని అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటున్నారు. విధి నిర్వహణలో గుర్తింపుతో సింధూర ప్రైవేటు బ్యాంకులో మేనేజర్ స్థాయికి ఎదిగారు. చెన్నైలో ఉంటున్న ప్రతాప్ వారాంతపు సమయంలో నగరం వచ్చి వెళ్తుండేవాడు.