హైదరాబాద్ సైదాబాద్ బాలిక హత్య ఘటన నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం తెలంగాణ యాదాద్రి జిల్లాలోని అడ్డగూడూరులో రాజును అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్ వెల్లడించారు. రాజు స్వగ్రామం అడ్డగూడూరని తెలిపారు. నిందితుడిని హైదరాబాద్ తరలించినట్లు పేర్కొన్నారు. బాలికపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడిగా రాజు ఉన్నాడు.
ఇదీ జరిగింది...
గురువారం సాయంత్రం హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో బాలిక అదృశ్యమైంది. సాయంత్రం నాలుగు- ఐదు గంటల మధ్య బయటకు వెళ్లిన చిన్నారి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు కాలనీ అంతా జల్లెడ పట్టారు. తెలిసినవాళ్లు, స్థానికుల సాయంతో.. అంతా వెతికారు. 9 గంటల సమయంలో పామ మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కాలనీ చుట్టుపక్కల వెతికారు. పక్కన గదిలో ఉండే రాజు కనిపించకపోవడంతో అతడిపై బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. రాజు కోసం వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో... రాత్రి 12 గంటల సమయంలో గది తాళాలను పగులగొట్టారు. ఆ తల్లిదండ్రులు ఏదైతే జరగకూడదు అని బలంగా కోరుకున్నారో అదే వాళ్ల కళ్లేదుట కనిపించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి విగతజీవిగా కనిపించింది. ఆ బుజ్జాయిని ఆ స్థితిలో చూసి.. తల్లిదండ్రులు బోరుమన్నారు. స్థానికులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అనుమానాస్పద స్థితిలో ఉన్న చిన్నారి మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డట్టు ఆరోపించారు. చిన్నారిపై దురాఘతానికి పాల్పడ్డాడన్న ఆలోచనే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది. "ఆ మానవమృగాన్ని మాకు అప్పగిస్తారా...? మీరే ఎన్కౌంటర్ చేస్తారా..?" అంటూ కోపంతో ఊగిపోయారు.
చంపాపేట్‌లో ఉద్రిక్తత..
నిన్న ఉదయం 7 గంటలకు చంపాపేట్ వద్ద సాగర్ రోడ్డుపై కాలనీవాసులంతా నిరసనకు దిగారు. అభం శుభం తెలియని చిన్నారిని పొట్టనబెట్టుకున్న నిందితుడు రాజును ఎన్కౌంటర్ చేయాలని లేదా తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. కాలనీవాసులకు నచ్చజెప్పే క్రమంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదే క్రమంలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో చంపాపేట్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఆందోళన మధ్యే.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.