గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో జరిగింది. ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై గుంటూరు నుంచి ఫిరంగిపురం వైపు వెళ్తున్నారు. వేములూరిపాడు మాల్కాజిగిరి చెరువు వద్దకు చేరుకున్నాక.. అటుగా వెళుతున్న గుర్తు తెలియని వాహనం.. వారి ద్విచక్ర వాహనాన్ని డీ కొట్టింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన మరో వ్యక్తిని 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
పరీక్షించిన వైద్యులు ఆ యువకుడు సైతం మరణించినట్లు తెలిపారు. మృతులు కర్నూలు జిల్లా వాసులు..సున్నిపెంటకు చెందిన షేక్ రఫీ, చందు లుగా గుర్తించారు. చందు హైదరాబాద్ లో ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. పంచనామా నిమిత్తం మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.