FAKE IT OFFICER ARREST : చెడు అలవాట్లు .. డబ్బుపై మోజు అతన్ని అడ్డదారి తొక్కించాయి. నగదు కోసం నకిలీ ఆదాయపు శాఖ అధికారి అవతారమెత్తి పోలీసులకు అడ్డంగా దొరికాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన తిరుమలరెడ్డి.. పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత బంగారం దుకాణంలో పనిచేశాడు. ఆ సమయంలోనే దుకాణానికి ఆదాయపు శాఖ అధికారులు వచ్చి ఆడిటింగ్ చేసేవాళ్లు. అయితే ఆడిటింగ్ చేసినపుడు అధికారులు ఏం చేస్తారు ? ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలపై నిఘా పెడతారు ? ఎలా ఆడిటింగ్ చేస్తారు? అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. కరోనా ప్రభావంతో బంగారు ఆభరణాల దుకాణం మూతపడింది. దాంతో ఆదాయం సమకూరే మార్గం లేక బెట్టింగ్ ,రేసింగ్లకు పాల్పడేవాడు. దీని కోసం అడ్డదారిలో నగదు సంపాదించేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడే నకిలీ ఆదాయపు శాఖ అధికారి అవతారమెత్తాడు. ఆదాయపు శాఖ ఇన్స్పెక్టర్ ధూళిపూడి కిషోర్ అనే పేరుతో విజయవాడలోని పలువురు వ్యాపారస్తులకు ఫోన్ చేసి .. డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశాడు.
డబ్బివ్వకపోతే మీ సంస్థపై ఆడిటింగ్ చేస్తామని బెదిరించేవాడు. భయపడిన కొందరు చెల్లిస్తే.. మరికొందరు ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ తమ సిబ్బంది పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేక బృందాలతో గాలించారు. నిందితుడు తిరుమలరెడ్డి ఇచ్చిన బ్యాంక్ ఖాతా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అప్పుడే మనోడి బాగోతం బయటపడింది. తీగ లాగితే డొంక కదిలినట్లు బ్యాంకు ఖాతా ఆధారంగా విచారణ జరపగా.. ఆ ఖాతా ఓ బెగ్గర్ది అని తేలింది. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి తిరుమలరెడ్డిని నిందితుడిగా గుర్తించారు. అనంతరం అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడే అతనిలోని మరో కోణం వెలుగుచూసింది. తిరుమల రెడ్డిపై గతంలో విశాఖ, గుంటూరు, చీరాల పోలీస్స్టేషన్స్లో కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.