Son Killed Father in Medchal : తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధి కుత్బుల్లాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. పక్షవాతంతో మంచాన పడిన తండ్రికి సపర్యలు చేయలేక ఓ తనయుడు విచక్షణారహితంగా కొట్టి హత్య చేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన సత్యనారాయణ(70) కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చారు. చిన్నాచితకా పనులు చేసుకుంటూ కుత్బుల్లాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఓ కొడుకు, ఇద్దరు కుమార్తెలు.. కష్టపడి ఉన్నంతలో అందరికీ పెళ్లిళ్లు చేశారు. ఆపై అనారోగ్యంతో పక్షవాతం బారినపడి కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యారు.
సేవ చేయలేక.. పక్షవాతమొచ్చిన తండ్రిని చంపిన కుమారుడు - medchal district crime news
Son Killed Father in Medchal : కన్నబిడ్డల్ని పెంచి, పెద్ద చేయడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటారు తల్లిదండ్రులు. అలాంటి వారిని పిల్లలు వృద్ధాప్యంలో ఎలా చూసుకోవాలి? కాస్త ఓరిమితో చిన్నాచితకా అవసరాలు తీరుస్తూనే కంటికి రెప్పలా కాచుకోవాలి. అనారోగ్యం వస్తే ధైర్యం చెప్పాలి. నేనున్నానంటూ భరోసానివ్వాలి. ఓ కొడుకు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. కర్కశంగా.. కనిపెంచిన తండ్రి ప్రాణాలు తీశాడు. పక్షవాతంతో మంచానికి పరిమితమైన తండ్రికి సేవలు చేయలేక.. కొడుకే కొట్టి చంపిన ఘటన తెలంగాణ జీడిమెట్ల ఠాణా పరిధిలో మంగళవారం వెలుగు చూసింది.
పెయింటర్‌గా పనిచేసే కొడుకు సురేశ్‌బాబు(38)కు గతంలోనే వివాహమైంది. విభేదాల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తండ్రికి పక్షవాతం కారణంగా అన్ని పనులు చేసుకోలేక పోతుండటంతో భార్య, కొడుకు ఆయనకు సాయం చేస్తుంటారు. సపర్యలు చేసే విషయంలో సోమవారం తండ్రి, కొడుకుల మధ్య గొడవ జరిగింది. సురేశ్ మద్యం మత్తులో ఉండటంతో తల్లి భయపడి సమీపంలోని కుమార్తె ఇంటికి వెళ్లింది.
ఇదే సమయంలో సురేశ్.. కత్తితో తండ్రి మెడపై పొడిచేందుకు విఫలయత్నం చేశాడు. ఆపై బెల్టు, కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో ఆ దెబ్బలు తాళలేక సత్యనారాయణ ప్రాణాలొదిలారు. దాన్ని సురేశ్ సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా.. పక్కింటి వ్యక్తి అనుమానించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా.. గాయాలు కనిపించాయి. తమదైన శైలిలో ప్రశ్నించగా తానే కొట్టి చంపినట్లు సురేశ్ అంగీకరించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.