Son Addicted to alcohol: తాగుడు.. వ్యసనాలకు బానిసైన కొడుకును జన్మనిచ్చిన తల్లే హతమార్చి మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టిన వైనం వారం రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన ఆకుల సీతారావమ్మ, పుల్లయ్య దంపతులకు మహంకాళరావు, బాజీ ఇద్దరు కుమారులు. పదేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో పుల్లయ్య మృతి చెందారు. దీంతో సీతారావమ్మ పెద్ద కుమారుడు మహంకాళరావు (37)కు తన మేనకోడలు మాదలకు చెందిన శ్రీలక్ష్మిని ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు మగపిల్లలు. మద్యం, వ్యసనాలకు బానిసైన మహంకాళరావు భార్యను, తల్లిని తరచూ వేధించేవాడు. దీంతో అతని భార్య తన ఇద్దరు బిడ్డల్ని పుట్టింట్లో ఉంచి పోషించుకుంటోంది. నాలుగు నెలల క్రితం భర్త వేధిపులు మరింత అధికం కావడంతో పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది.
ఈ నెల 15వ తేదీ రాత్రి సమయంలో మహంకాళరావు మద్యం తాగి వచ్చి తల్లితో గొడవపడి దాడికి దిగాడు. అతని చేష్టలతో విసిగిపోయిన ఆమె తన చేతిలో ఉన్న కర్రతో కొట్టడంతో ఆయువు పట్టున తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దిక్కుతోచని స్థితిలో చిన్న కొడుకు సాయంతో మృతదేహాన్ని తాము నివసించే పెకుటింటి వెనుక భాగంలో పూడ్చిపెట్టారు. ఇంటి ముందు వరండాలో వంట చేసుకుంటూ వారం రోజులుగా వారిద్దరూ అదే ఇంట్లో గడిపారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సీతారావమ్మ, చిన్న కుమారుడు బాజీ ఈ ఘటన తరువాత తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కోడలు శ్రీలక్ష్మిని ఇంటికి పిలిపించి జరిగిన ఘటన వివరించారు. వెంటనే మృతుడి భార్య గురువారం స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనూహ్యంగా జరిగిన సంఘటనకు తల్లి, తమ్ముడు ఇరువురు కలసి మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టినట్లు సంతమాగులూరు సిఐ శివరామకృష్టారెడ్డి తెలిపారు. మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.