భార్య మీద తనకున్న అనుమానమే పెనుభూతమైంది. అర్ధాంగినే అంతమొందించే స్థాయికి చేరింది. తాను చేసిన కిరాతకాన్ని మూడో కంటికి తెలియకుండా కాలగర్భంలో కప్పిపెట్టేందుకు మహమ్మారి కరోనా పేరును ఉపయోగపడింది. అనుమానంతో భర్యను చంపేసి.. కరోనాతో మరణించిందని అందరిని నమ్మించాడు ఓ ప్రబుద్ధుడు. ఎవరినీ దగ్గరికి రాకుండా జాగ్రత్తపడి.. నిజం ఎక్కడా బయటపడకుండా అంత్యక్రియలు సైతం జరిపించాడు. అంతా అయిపోయిందనుకునే సమయంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు వచ్చి అనుమానంతో అసలు విషయం బయటపడింది.
అసలు ఏం జరిగిందంటే..
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కమ్మగ్రామంలోని సుందరయ్యనగర్ కాలనీకి చెందిన రమావత్ విజయ్ నాయక్.. నల్లగొండ జిల్లా పిల్లగుంట్ల తండాకు చెందిన కవితను వివాహమాడాడు. ఆటో నడుపుతూ జీవనం కొనసాగించే విజయ్.. పెళ్లి తర్వాత వనస్థలిపురంలోని వైదేహీనగర్లో కాపురం పెట్టాడు. పెళ్లైన కొత్తలో భర్యను అపురూపంగా చూసుకున్నాడు. భార్య అందంగా ఉంటుందని మురిసిపోయే అతని ఆనందం కాస్తా.. రానురాను అభద్రతాభావంగా రూపాంతరం చెందింది. అది కాస్తా.. అనుమానపు విత్తును నాటింది. భార్య ఎవరితో ముచ్చటించినా.. ఫోన్లో మాట్లాడినా.. అనుమానించటం మొదలుపెట్టాడు.
కరోనా వచ్చిందని నమ్మించి..
తన అందమే తనకు యమపాశమవుతుందని ఆమె కలలో కూడా ఊహించి ఉండదు. తన సౌందర్యమైన రూపాన్ని చూసి వరించిన మొగుడే.. తనపాలిట యముడవుతాడని ఆ వివాహిత అంచనా వేసి ఉండదు. విజయ్‌లో చిన్నగా మొదలైన అనుమానం పెనుభూతమైంది. తనలో ఉన్న భర్తను.. కిరాతకునిగా మార్చేసింది. భార్యను ఎలాగైనా చంపాలని నిశ్చయించుకున్నా విజయ్.. పథకం రచించాడు. జూన్ 18న భార్య పడుకున్న సమయంలో దిండుతో గాలాడకుండా చేసి హతమార్చాడు. ఈ నేరం బయటకురాకుండా చేయాలని విజయ్ మరో ఎత్తు వేశాడు. కవితకు కరోనా వచ్చిందని.. పరిస్థితి విషమించి చనిపోయిందని.. ఆమె తల్లిదండ్రులకు తెలియజేశాడు.
తన ఆటోలోనే కవిత మృతదేహాన్ని.. పిల్లగుంట్ల తండాకు తీసుకెళ్లాడు. కరోనా బారిన పడే కవిత చనిపోయిందని అందరినీ నమ్మించాడు విజయ్. అంత్యక్రియలు చేసే సమయంలోనూ.. ఎవరూ దగ్గరికి రావొద్దని, వస్తే వారికి కూడా అంటుకుంటుందని భయపెట్టాడు. అప్పటికీ కొందరు సాయం చేసి.. అంత్యక్రియలు జరిపారు. "హమ్మయ్యా అంతా అయిపోయింది.. ఇక తన మీద ఎవరికి అనుమానం రాలేదు" అని విజయ్ రిలాక్స్ అయ్యాడు. అయితే అసలు కథ అప్పుడే మొదలైంది.