ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LOCKUP DEATH CASE: పరిహారం ఇస్తే... ప్రాణాలు తిరిగి వస్తాయా?: తెలంగాణ హైకోర్టు

మరియమ్మ లాకప్ డెత్‌ కేసు(Mariamma lockup death case) తెలంగాణ హైకోర్టు(telangana High Court)లో విచారణకు వచ్చింది. మేజిస్ట్రేట్ నివేదిక రావాల్సి ఉన్నందున ప్రస్తుతం విచారణ వాయిదా వేశారు. మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం సాయం ప్రకటించిందని ఏజీ తెలిపారు. దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పరిహారంతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా.. అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

By

Published : Aug 2, 2021, 6:08 PM IST

Published : Aug 2, 2021, 6:08 PM IST

telangana High Court)
తెలంగాణ హైకోర్టు

లాకప్ డెత్​లో మరణించిన మరియమ్మ కుటుంబానికి పరిహారం చెల్లించిన మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అడ్డగూడూరు పోలీస్ స్టేషన్​లో మరియమ్మ లాకప్ డెత్ ఘటనపై పీయూసీఎల్ కార్యదర్శి జయ వింధ్యాల దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయ్​సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.

మరియమ్మ మృతదేహానికి గత నెలలో రీపోస్టుమార్టం పూర్తయిందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. మరియమ్మ కుటుంబానికి 15 లక్షల రూపాయల పరిహారం, ఉద్యోగం ఇచ్చినట్లు వివరించారు. బాధ్యులైన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. పోలీస్ స్టేషన్​లో సీసీ కెమెరాలు పనిచేయక పోవడంపై హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఆలేరు మేజిస్ట్రేట్ నుంచి న్యాయ విచారణ నివేదిక వచ్చిన తర్వాత విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది. మేజిస్ట్రేట్ నివేదిక అందిన తర్వాత నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 15కి వాయిదా వేసింది.

అసలేం జరిగింది..

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌లో మరియమ్మ అనే ఎస్సీ మహిళ మృతిచెందటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడకు చెందిన మరియమ్మ... యాదాద్రి జిల్లా గోవిందాపురంలో చర్చి పాస్టర్ బాలశౌరి ఇంట్లో వంట మనిషిగా పనిచేశారు.

జూన్​ 3న ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్‌తోపాటు అతని స్నేహితుడు శంకర్‌... గోవిందాపురం వచ్చారు. జూన్​ 5న ఫాదర్ పని మీద హైదరాబాద్ వెళ్లారు. మరుసటి రోజు వచ్చేసరికి... ఇంట్లో 2 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. డబ్బుల విషయమై మరియమ్మను పాస్టర్‌ ప్రశ్నించారు. మర్నాడు మరియమ్మతోపాటు ఆమె కుమారుడు... రాత్రికి రాత్రే పరారయ్యారు. సొమ్ము పోయిందని అడ్డగూడురు పోలీస్ స్టేషన్‌లో ఫాదర్‌ ఫిర్యాదు చేశారు. కేసులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు... ఆ నెల 18న మరియమ్మను పిలిపించారు. విచారణలో భాగంగా... ఆమె స్పృహ కోల్పోయిందని.... భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మరియమ్మ మృతిచెందటంతో పోలీసులే అమె మృతికి కారణమని ఆరోపణలు వచ్చాయి.ఈ విషయాలన్నీ బయటకు తెలిస్తే ప్రమాదమని భావించిన పోలీసులు... భువనగిరి కేంద్రంగా వ్యవహారం నడిపారు. జూన్​ 19న ఠాణాలో కాకుండా... రహస్య ప్రదేశంలో ఉదయం నుంచే మంతనాలు సాగించారు.

దొంగతనం జరిగిన 2 లక్షల్లో... 90 వేలను అప్పటికే స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో... మరియమ్మ ప్రాణాలు కోల్పోయింది. మరియమ్మ మృతితో ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో... విచారణ జరిపిన రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్​ భగవత్‌ ఎస్సై మహేష్‌, కానిస్టేబుళ్లు జానయ్య, రషీద్‌ పటేల్‌ను సర్వీసు నుంచి తొలగించారు.

ఇదీ చదవండి:

'రేప్​ చేసిన వ్యక్తితోనే పెళ్లి'కి సుప్రీం నో!

ABOUT THE AUTHOR

...view details