Jubileehills gang rape case: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు నేరాభియోగ పత్రాలు దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు, జస్టిస్ జువైనల్ బోర్డులో జూబ్లీహిల్స్ పోలీసులు వేర్వేరుగా నిందితులపై నేరాభియోగ పత్రాలను దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసులు ఏకంగా 65 మందిని సాక్షులుగా చేర్చారు. మైనర్ బాలురు తీవ్రమైన నేరం చేసినట్లు నేరాభియోగ పత్రంలో వెల్లడించారు. అంతేకాకుండా.. సాక్ష్యాలను కూడా పోలీసులు పకడ్బందీగా సిద్ధం చేశారు.
మే 28న మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరగ్గా... మే 31న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని బాలిక వాంగ్మూలం సేకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు.. విడతలవారిగా సాదుద్దీన్‌తో(saduddin malik) పాటు మరో ఐదుగురు మైనర్లను జూన్ 5న తేదీన అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రాజకీయ రంగు పులుముకోవటంతో ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. తీవ్రంగా శ్రమించి తగిన ఆధారాలు సేకరించారు. నిందితులు నేరం చేసినట్టు నిరూపించేందుకు కావాల్సిన అన్ని సాక్ష్యాలను పోలీసులు సేకరించగా.. అందులో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. తగిన సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు.. కేసుకు సంబంధించి నేరాభియోగపత్రం దాఖలు చేశారు.
ఈ కేసులో కీలక ఆధారాల కోసం.. అత్యాచారం చేసిన వాహనంలో దొరికిన వెంట్రుకలు, నాప్‌కిన్‌లు, వీర్యం నమూనాలు, తిని పారేసిన చూయింగమ్‌లను ఫొరెన్సిక్ అధికారులు సేకరించారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన రోజు ఆమె వేసుకున్న దుస్తులపై మైనర్ బాలుర డీఎన్ఏను ఎఫ్ఎస్ఎల్ అధికారులు గుర్తించారు. బాలిక దుస్తులపై దొరికిన నమూనాలు, కారులో లభ్యమైన ఆధారాలతో నిందితుల డీఎన్ఏ సరిపోలినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ ఒక్క కీలక ఆధారంతో.. అత్యాచారం వాల్లే చేశారనడానికి పోలీసులకు సరైన సాక్ష్యం దొరికినట్టైంది. ఫోరెన్సిక్ అధికారుల ఇచ్చిన నివేదిక వివరాలను పోలీసులు ఛార్జీషీట్‌లో పొందుపరిచారు.