ఆడబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే అత్యాచారం చేయిస్తానని బెదిరిస్తే.. పైగా డబ్బుల కోసం ఉన్నపలంగా ఆమెను ఇల్లు వదిలి వెళ్లమంటే ఆ కూతురు పరిస్థితి ఏంటి?. ఆపదలో అండగా నిలవాల్సిన నాన్నే ఇంటిని వదిలి వెళ్లాలని బలవంతం చేస్తే వారంతా ఎక్కడకు పోవాలి? భార్య పేరు మీదున్న ఆస్తి కోసం కన్నబిడ్డలను సైతం వేధిస్తుంటే ఏం చేయాలో తెలియక ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది.
పిల్లలపై దాడి
తండ్రి వేధింపులు తాళలేక చివరకు ఆ కూతురు పోలీసులను ఆశ్రయించారు. అత్యాచారం చేయిస్తానంటూ కన్నకూతురిని బెదిరిస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నంబరు 10లో ఓ ఎంఫిల్ విద్యార్థిని తన తల్లి, తండ్రి, సోదరితో కలిసి ఓ ఇంట్లో ఉంటున్నారు. ఇల్లు వదిలి వెళ్లాలంటూ కొంత కాలంగా ఆమెతో పాటు తల్లిని తండ్రి బెదిరిస్తున్నాడని ఎస్సై కన్నెబోయిన ఉదయ్ తెలిపారు. ఈ క్రమంలోనే శనివారం ఇంట్లోకి వచ్చిన తండ్రి భార్య, కుమార్తెలపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.