ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Tollywood Drugs case : నందును 7 గంటలు, కెల్విన్‌ను 6 గంటల పాటు విచారించిన ఈడీ - తెలంగాణ వార్తలు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ(Enforcement Directorate) అధికారులు దూకుడు పెంచారు. మత్తుమందు సరఫరాదారులు కెల్విన్, వాహిద్‌తో పాటు మరో వ్యక్తిని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. సినీ నటుడు నందును కూడా ప్రశ్నించిన అధికారులు.. అతని బ్యాంకు లావాదేవీల వివరాలను సేకరించారు. కెల్విన్ మూలంగానే టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. ఎక్సైజ్ సిట్ అధికారులు... కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే దర్యాప్తు నిర్వహించారు. నేడు దగ్గుబాటి రానా, ముమైత్ ఖాన్ ఈడీ అధికారుల ఎదుట హజరయ్యే అవకాశం ఉంది.

enforcement
enforcement

By

Published : Sep 8, 2021, 8:53 AM IST

Updated : Sep 8, 2021, 9:28 AM IST

నందును 7 గంటలు, కెల్విన్‌ను 6 గంటల పాటు విచారించిన ఈడీ

టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు(TOLLYWOOD DRUGS CASE) సంబంధించి మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు మంగళవారం పలువురిని ప్రశ్నించారు. సినీ నటుడు నందును ప్రశ్నించిన ఈడీ అధికారులు... అతని బ్యాంకు లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 20న నందు ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, ముందే హాజరవుతానని ఈడీ(ED) అధికారులను కోరాడు. అతని బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులకు అందించాడు. అందులో అనుమానాస్పదంగా కనిపించిన లావాదేవీల గురించి ఈడీ అధికారులు నందును అడిగి తెలుసుకున్నారు. దాదాపు 7 గంటల పాటు ఈడీ అధికారులు నందును ప్రశ్నించారు. రాత్రి 7 గంటల సమయంలో నందు ఈడీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లాడు.

కెల్విన్‌ ఇంట్లో తనిఖీలు..

టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు మూలంగా భావిస్తున్న కెల్విన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆయన సహాయకులుగా వ్యవహరించిన అబ్దుల్ వాహిద్‌తో పాటు మరో వ్యక్తినిఈడీ అధికారులు ప్రశ్నించారు. ఉదయం 5 గంటల సమయంలో ఈడీ అధికారులు పాత బోయిన్‌పల్లిలోని కెల్విన్‌ ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తనిఖీలకు నిరాకరించారు. సెర్చ్‌ వారెంట్‌ చూపించిన ఈడీ అధికారులు కెల్విన్‌ గదిలోనూ తనిఖీలు నిర్వహించారు. అతని చరవాణి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కెల్విన్‌ ఈడీ అధికారుల ఎదుట కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఈడీ అధికారులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆసిఫ్‌నగర్‌లోని అబ్దుల్‌ వాహిద్‌ ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు... ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకొని అతన్ని కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇద్దరిని దాదాపు 6 గంటల పాటు కార్యాలయంలో ప్రశ్నించారు.

భారీగా నగదు బదిలీ..

కెల్విన్‌ బ్యాంకు ఖాతాలకు భారీగా నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. ఈ లావాదేవీలు ఎందుకు జరిగాయని కెల్విన్‌ను ప్రశ్నించారు. బ్యాంకు లావాదేవీల సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఎక్సైజ్‌ సిట్‌ అధికారులు సైతం 2017 జులైలో కెల్విన్‌ను అరెస్ట్‌ చేసి అతనిచ్చిన సమాచారం ఆధారంగానే దర్యాప్తు నిర్వహించారు. కెల్విన్‌ ఫోన్‌లో నెంబర్లు, వాట్సాప్‌ ఛాటింగ్‌ ఆధారంగా 62 మందిని ప్రశ్నించారు. అందులో సినీ రంగానికి చెందిన వాళ్లు 12మంది ఉన్నారు. ఎక్సైజ్ అధికారులు 12 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసి అందులో 11 అభియోగపత్రాలు దాఖలు చేశారు. కెల్విన్​తో పాటు దాదాపు 30మందిని అరెస్ట్ చేశారు. వీళ్లలో ఐదుగురు ఆఫ్రికన్లతో పాటు మిగతా వాళ్లలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఇంజినీరింగ్ విద్యార్థులున్నారు.

ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు మనీలాండరింగ్ ఎలా జరిగిందనే దిశగా వివరాలు సేకరిస్తున్నారు. మనీలాండరింగ్ పాల్పడినట్లు తేలితే సంబంధింత వ్యక్తులను మనీ లాండరింగ్‌ నిరోధక చట్ట ప్రకారం శిక్షపడే అవకాశం ఉంది.

నేడు ఈడీ ముందుకు ఆ ఇద్దరు!

ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్.. నటి, నిర్మాత ఛార్మి.. నటి రకుల్ ప్రీత్ సింగ్​లను విచారించారు. మంగళవారం నందును ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇవాళ నటి ముమైత్ ఖాన్, దగ్గుబాటి రానా ఈడీ ముందుకు వచ్చే అవకాశముంది.

అభియోగపత్రం..

ఇదిలా ఉండగా.. మాదక ద్రవ్యాల విక్రేత కెల్విన్​పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు అభియోగపత్రం దాఖలు చేశారు. కెల్విన్​ను 2016లో బోయిన్​పల్లి వద్ద టాస్క్ ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేసి, ఎల్ఎస్​డీ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల వివరాలతో 2016 ఆగస్టులో కెల్విన్​పై బోయిన్​పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సీసీఎస్​లోని నార్కోటిక్స్ విభాగానికి కేసు బదిలీ అయింది. పోలీసులు కెల్విన్​ను లోతుగా విచారణ జరపకపోవడం, సకాలంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయక పోవడంతో బెయిల్​పై విడుదలయ్యాడు.

ఆ తర్వాత ఏడాదే మళ్లీ ఎక్సైజ్ పోలీసులు కెల్విన్​ను అరెస్టు చేశారు. ఎక్సైజ్ పోలీసులు కెల్విన్​ను విచారణ జరిపినపుడు టాలీవుడ్ లింకులు సహా అనేక విషయాలు వెలుగు చూశాయి. అయితే అయిదేళ్ల తర్వాత సీసీఎస్​లోని నార్కోటిక్స్ విభాగం ఇటీవల నాంపల్లి కోర్టులో అభియోగపత్రం పత్రం దాఖలు చేశారు. ఛార్జ్​షీట్​ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు.. అక్టోబర్​ 11న విచారణకు హాజరు కావాలని కెల్విన్​ను ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది.

ఇవీ చూడండి: RAINS : ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు... మునిగిన ఏజెన్సీ..

Last Updated : Sep 8, 2021, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details