ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో.. నిందితుల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు! - అక్రమాస్తుల జప్తు

మత్తు పదార్థాల కేసులో నిందితుల ఆర్థిక లావాదేవీల్లో చోటు చేసుకున్న అక్రమాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. అవసరమైతే.. అక్రమ ఆస్తులు జప్తు చేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. డ్రగ్స్ కొనుగోలు పెట్టుబడి నుంచి అక్రమంగా ఆర్జించిన లాభాల వరకు.. కూపీ లాగేందుకు సిద్ధమవుతోంది. అంతిమ లబ్ధిదారులను గుర్తించి.. స్థిర, చరాస్తులను జప్తు చేసే దిశగా విచారణ సాగుతోంది. ఈనెల 31 నుంచి.. సినీ ప్రముఖుల విచారణ మొదలు పెట్టనుంది.

drugs case in telangana
drugs case in telangana

By

Published : Aug 28, 2021, 7:37 PM IST

మత్తు పదార్థాల వ్యవహారంలో ఆర్థిక అక్రమ లావాదేవీల తీగలాగేందుకు.. ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ సిద్ధమైంది. ఎక్సైజ్​ కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 3, 4 ప్రకారం ఈసీఐఆర్ నమోదు చేసింది. డ్రగ్స్ ఎవరు తెచ్చారు.. ఎక్కడి నుంచి వచ్చాయనే అంశాలపై.. ఆబ్కారీ శాఖ ఇప్పటికే తేల్చి.. నిందితులపై 12 అభియోగ పత్రాలను దాఖలు చేసింది. కెల్విన్, రాన్​సన్ జోసెఫ్, మైక్​కమింగా, అలెక్స్ విక్టర్, మహమ్మద్ ఉస్మాన్, అబూబాబర్ తదితరులపై.. ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. పన్నెండు మంది సినీ ప్రముఖులను విచారణ చేసి.. వారి రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను సేకరించారు. అయితే ఛార్జ్ షీట్లలోని నిందితులు.. సాక్షుల జాబితాలో వారెవరి పేర్లనూ ప్రస్తావించలేదు. ఎక్సైజ్ శాఖ ఛార్జ్ షీట్లు.. సాక్షుల వాంగ్మూలాలను ఈడీ అధికారులు.. కోర్టు నుంచి సేకరించినట్లు తెలుస్తోంది.

నేరం ఎలా జరిగిందనే అంశాలను.. ఆబ్కారీ శాఖ తేల్చినందున.. మనీలాండరింగ్ అంశాలపైనే దృష్టి సారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సిద్ధమయ్యారు. నార్కోటిక్స్ చట్టాన్ని ఉల్లంఘించి.. నేరం ద్వారా సంపాదించిన సొమ్మును.. ఆర్థిక వ్యవస్థలోకి ఎలా మళ్లించారనే అంశాలపై దర్యాప్తు చేయనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. మొదట డ్రగ్స్ ఎవరు కొనుగోలు చేశారు.. పెట్టుబడి ఎవరు పెట్టారు.. ఆ తర్వాత ఎవరెవరి చేతులు మారాయి.. చివరకు ఆ అక్రమ సంపాదన, లాభాలు ప్రస్తుతం ఎక్కడ, ఏ రూపంలో గుర్తించే దిశగా విచారణ చేపట్టనున్నారు. అంతిమ లబ్ధిదారులను గుర్తించి.. మత్తు పదార్థాల ద్వారా చేతులు మారిన సొమ్ము ప్రస్తుతం నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, నగలు, భూములు, షేర్ల రూపాల్లో ఉన్నట్లయితే.. వాటిని జప్తు చేసేందుకు దర్యాప్తు చేపట్టారు. ఈనెల 31 నుంచి సినీ ప్రముఖులను ప్రశ్నించనున్నారు. ఈనెల 31న పూరీ జగన్నాథ్, సెప్టెంబరు 2న చార్మి.. 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుపాటి.. 9న రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్.. 13న నవదీప్, ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్.. 17న తనీష్, 20న నందూ, 22న తరుణ్ హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో సినీ ప్రముఖులతో పాటు.. డ్రగ్స్ విక్రేతలను ఈడీ బృందాలు ప్రశ్నించనున్నాయి.

నార్కోటిక్స్ చట్టం ప్రకారం సినీ ప్రముఖులు నిందితులు కాదని ఆబ్కారీ శాఖ తేల్చింది. అయితే.. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నిందితులా.. సాక్షులా విచారణలో తేలుతుందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. విచారణలో నిందితులు, సాక్షులు చెప్పే అంశాలను బట్టి.. అవసరమైతే పలు చోట్ల సోదాలు కూడా చేసేందుకు ఈడీ బృందాలు సిద్ధమవుతున్నాయి. దర్యాప్తు చేస్తున్న క్రమంలో విదేశాల నుంచి ఇక్కడికి.. లేదా మన దేశం నుంచి విదేశాలకు హవాలా మార్గంలో సొమ్ము తరలించినట్లు తేలితే.. ఫెమా చట్టం కింద మరికొన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సుమారు రెండు, మూడు నెలల పాటు సుదీర్ఘ విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చూడండి:

RK Roja: టీచర్​గా మారిన ఎమ్మెల్యే రోజా.. విద్యార్థులకు సోషల్ పాఠాలు

ABOUT THE AUTHOR

...view details