Secunderabad Fire Accident Update: తెలంగాణలో అగ్నిప్రమాదానికి గురైన దక్కన్ మాల్ ఏ క్షణమైనా పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉండటంతో, చుట్టుపక్కల ఉన్న వారికి ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు రోజులుగా మంటల్లో ఉన్న భవన సముదాయంలోని శ్లాబులు ఒక్కొక్కటిగా పెచ్చులూడుతూ వచ్చాయి. నిన్న 1, 2, 3 అంతస్తుల వరకూ శ్లాబులు కూలి సెల్లార్లో పడిపోయాయి.
ఈ ప్రాంతంలో మంటలు ఎక్కువగా రావడం వల్లే స్టాల్ పూర్తిగా బలహీన పడి కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. భవనం క్రమంగా బలహీనపడి కుప్పకూలే ప్రమాదం ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. భవనం చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేసిన కుటుంబాలను ఎట్టిపరిస్థితుల్లోనూ లోపలకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. ప్రమాదంలో చిక్కి గల్లంతైన ముగ్గురిలో శనివారం ఒకరి ఎముకల అవశేషాలు సేకరించి డీఎన్ఏ పరీక్షకు పంపారు.
Deccan Mall is in Danger of Collapsing: మరో ఇద్దరి ఆనవాళ్లు గుర్తించటం పోలీసు యంత్రాంగానికి సవాలుగా మారింది. పోలీసులు, అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బంది భవనం మొత్తం గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. శనివారం లభించిన ఒకరి అవశేషాలు మొదటి అంతస్తులో లిఫ్ట్ మెట్ల మార్గం వద్ద లభించాయి. అదేచోట శ్లాబులు కూలిపోవటంతో కనిపించకుండా పోయిన ఇద్దరి ఆనవాళ్లు శిథిలాల కింద ఉండిపోవచ్చని అగ్నిమాపకశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.