భూవివాదానికి సంబంధించి న్యాయస్థానంలో తాము కేసు ఓడిపోవడానికి న్యాయవాదే కారణమని భావించిన కక్షిదారులు దారుణానికి తెగబడ్డారు. సదరు న్యాయవాదిపై హత్యాయత్నం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు. గతవారం జరిగిన ఈ విషయాన్ని అధికారులు రహస్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కేసు ఓడిపోయాడని న్యాయవాదిపై హత్యాయత్నం - హైదరాబాద్ నేరవార్తలు
కేసు ఓడిపోయాడని ఓ న్యాయవాదిపై హత్యాయత్నం చేశారు కక్షిదారులు. తుపాకీతో గురిపెట్టి.. కత్తితో బెదిరించి చంపబోయారు. అక్కడకు చేరిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీస్తుండటాన్ని గమనించిన వారు వెనక్కు తగ్గారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
హిమాయత్‌నగర్ విధినంబర్ 7లో ఉండే హైకోర్టు న్యాయవాది జశ్వంత్ ఓ భూవివాదానికి సంబంధించిన కేసు వాదిస్తున్నారు. ఈ కేసులో ఇటీవల కక్షిదారులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. న్యాయవాది నిర్లక్ష్యం వల్లే తాము కేసు ఓడిపోయామని కక్షిదారులు భావించారు. దీంతో కక్షకట్టిన వారు ఈ నెల 17న సాయంత్రం 6 గంటల సమయంలో గౌడ హాస్టల్ సమీపంలో న్యాయవాదిని అడ్డగించి బాహాబాహీకి దిగారు. భూ యజమాని తరఫువాళ్లు తమ వెంట తెచ్చుకున్న తుపాకీతో న్యాయవాది తలకు గురిపెట్టడంతో పాటు.. కత్తితో పొడించేందుకు సిద్ధపడ్డారు. అక్కడకు చేరిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీస్తుండటాన్ని గమనించిన వారు వెనక్కు తగ్గారు. డయల్ -100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువైపుల వారినీ అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం... సెక్టార్ ఎస్సై కాకుండా మరొకరికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
- ఇదీ చూడండి :దుర్గగుడి అక్రమాల వ్యవహారంలో చర్యలు..