వ్యక్తి హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు: పల్నాడు జిల్లా వ్యక్తి హత్య కేసులో నలుగురికి నరసరావుపేట 13వ అదనపు సెషన్స్ జడ్జి జీవిత ఖైదు విధించారు. 2017లో నాదెండ్ల మండలం పొనుగుపాడులో హత్య జరిగిన విషయం తెలిసిందే. సొంత బావతో వివాహేతర సంబంధం కారణంగా భర్తను భార్య హత్యచేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం... మృతుడి భార్య శ్రీలక్ష్మితో పాటు మరో ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.
ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలలో పురిట్లోనే బిడ్డ మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రసవం కోసం నిన్న కోటేశ్వరి అనే గర్భిణి... ప్రభుత్వ వైద్యశాలలో చేరగా... పురిట్లోనే పసికందు మరణించింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు.
నెల్లూరు జిల్లా:నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరు గ్రామంలో ఈ నెల 16న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వీరి నుంచి హత్యకు ఉపయోగించిన స్కూటీ, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. వేగూరు హరిజనవాడకు చెందిన చిన్నమ్మకు శివయ్య అనే వ్యక్తితో 24ఏళ్ల క్రితం వివాహమైంది. కొంత కాలం సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు రావడంతో శివయ్య మాధురి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి వంశీ, నితీష్ అనే ఇద్దరు కుమారులున్నారు. అయితే గత కొంత కాలంగా శివయ్య మొదటి భార్య అయిన చిన్నమ్మ వద్దకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. తండ్రి తమ ఇంటికి రాకపోవడానికి చిన్నమ్మ కారణమని కక్ష్య కట్టిన రెండో భార్య కుమారులు... తల్లి వరసయ్యే మహిళను కత్తులతో పొడిచి కిరాతకంగా హతమార్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు వంశీ, నితీష్‌లను అరెస్ట్ చేశారు. పథకం ప్రకారమే మహిళను కిరాతకంగా హత్య చేశారని డీఎస్పీ హరనాథ్ రెడ్డి తెలిపారు.
* నెల్లూరు జిల్లాలో నాటు సారా తయారీ ప్రాంతాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. గ్రామాల్లో నాటుసారా తయారు చేస్తే పిడి యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని ఆత్మకూరు సెబ్ సీఐ నయనతార హెచ్చరించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం గుడిపాడు గ్రామంలో సెబ్ అధికారులు, పోలీసులు నాటుసారాపై కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా కాయకుండా ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించారు. గ్రామాలన్నీ నాటుసారా రహిత గ్రామాలుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి:సారా తయారీ ప్రాంతాలపై పోలీసులు దాడులు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి కాలువలో పడి మృతి చెందాడు. రాంభొట్ల వారిపాలెం గ్రామ శివారులోని నందికట్ట కాలువలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీయించారు. మృతుడు పిట్టలవానిపాలేం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన కె.రవికుమార్ (35)గా గుర్తించారు. మంగళగిరి ఆరవ బెటాలియన్‌లో హోమ్‌గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నాడని బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి... భార్యకు తీవ్ర గాయాలు:శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం జాతీయ రహదారి బెజ్జిపురం కూడలి వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న దంపతుల్లో భర్త అక్కడికక్కడే మృతి చెందారు. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై భార్యాభర్తలు శ్రీకాకుళం నుంచి విజయనగరం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు విజయనగరం జిల్లా పోల్బాగా కూడలికి చెందిన వారిగా రాజు(46), సుజాతగా గుర్తించారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గాయపడిన మహిళను 108 వాహనంలో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఏలూరు జిల్లా: అప్పుల బాధతో బ్యాంకు మేనెజర్ ఆత్మహత్య: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సాయి బాలాజీ టౌన్షిప్లో అప్పుల బాధ తాళలేక ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మారిశెట్టి నాగరాజు(35) ప్రైవేట్ బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బయటి నుంచి కొంత మొత్తాన్ని వడ్డీకి తీసుకున్నాడు. నాగరాజును ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో... మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకున్నాడని బంధువులు తెలిపారు. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి...ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని సోదరుడు తెలిపారు. మృతుడు నాగరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
విశాఖ జిల్లా: విశాఖ జిల్లా ఎలమంచిలి సమీపంలోని పెద్దపల్లి వద్ద కారు... ప్రమాదవశాత్తు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా... మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు.
* విశాఖ జిల్లా అల్లిపురం జైపూర్ లాడ్జిలో పోలీసులు గంజాయి సీజ్ చేశారు. కేరళకు చెందిన ఇద్దరి నుంచి 8 కిలోల లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.