సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా ప్రజలను దోచేస్తున్నారు. వలపు వల వేసి కొందరిని.. అవసరాలను అవకాశంగా తీసుకుని మరికొందరినీ.. అందినకాడికీ దండుకుంటున్నారు. జనాలు సైతం.. నేరగాళ్లను గుడ్డిగా నమ్మేసి ఉన్నదంతా ఊడ్చేసి... అంతా అయిపోయాక ఆగమవుతున్నారు. మోసపోయామని తెలిసాక పోలీసుల ముందు లబోదిబోమంటున్నారు.
రహస్యంగా చాటింగ్..
డేటింగ్ పేరుతో 77 ఏళ్ల వృద్ధుడి వద్ద సైబర్ కేటుగాళ్ళు 11 లక్షల రూపాయలు దండుకున్నారు. డేటింగ్ యాప్లో అమ్మాయిల పేరుతో నకిలీ అకౌంట్ సృష్టించి 77 ఏళ్ల వృద్ధునికి సైబర్ మోసగాళ్లు వలపు వల విసిరారు. అమ్మాయేనని భ్రమ పడిన వృద్ధుడు వలలో చిక్కుకున్నాడు. ఇక బాధితునితో ప్రేమ, డేటింగ్ అంటూ రహస్యంగా చాటింగ్ చేశారు. సరదాగా చాట్ చేసిన వృద్ధుడి నుంచి.. రకరకాల కారణాలతో రూ. 11 లక్షలను సైబర్ మోసగాళ్లు దొచేశారు. మరిన్ని డబ్బులు పంపించాలని ఒత్తిడి చేయడం వల్ల... అనుమానం వచ్చి వృద్ధుడు ఆలస్యంగా మోసపోయానని గుర్తించాడు. వెంటనే హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోన్ ఇస్తామని ఛార్జీల వసూలు...
ఇంకోదగ్గర.. లోన్ ఇస్తామంటూ నమ్మించి ఛార్జీల పేరుతో ఏకంగా 9 లక్షల 45 వేలు కాజేశారు. హైదరాబాద్ బోయిన్ పల్లికి చెందిన అనిల్ కుమార్కు ఓ రోజు ఫోన్ వచ్చింది. బజాజ్ ఫైనాన్స్ లిమిటెట్ కంపెనీలో లోన్ ఇస్తామంటూ.. నమ్మబలికారు. లోన్ అప్రూవల్ కోసం... ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ డాక్యుమెంట్ అంటూ.. వివిధ ఛార్జీల పేరుతో రూ. 9 లక్షల 45 వేల నగదును ఆన్లైన్ ద్వారా కట్టించుకున్నారు. ఆ తర్వాత ఫోన్ చేస్తే స్పందన లేదు. మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు... సైబర్ కేటుగాళ్లను పట్టుకున్నారు. దిల్లీకి చెందిన విజయ్ ధావన్, కపిల్ ఠాకూర్, అభయ్ వర్మ... అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 లక్షల నగదు, 8 చరవాణులు, వివిధ బ్యాంకులకు చెందిన చెక్ బుక్కులు, డెబిట్, క్రెడిట్ కార్డులను సీజ్ చేశారు. ముగ్గురిని రిమాండ్కు తరలించారు.
అప్రమత్తంగా ఉండండి...
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరినీ గుడ్డిగా నమ్మి లావాదేవీలు జరపకూడదని సూచిస్తున్నారు. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండి.. అవతలి వ్యక్తి గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. కళ్ల ముందే ఎన్నో మోసాలు జరుగుతున్నా.. ప్రజలు మోసపోవటం అజాగ్రత్తకు, అత్యాశకు నిదర్శనమని పోలీసులు చురకలంటిస్తున్నారు. మరోవైపు.. ఎన్ని ఎత్తులేసినా... సైబర్ నేరగాళ్లకు శిక్షలు పడటం ఖాయమని హెచ్చరిస్తున్నారు. అమాయకులను మోసం చేసి చట్టం నుంచి తప్పించుకుంటామనుకోవటం అవివేకమేనని.. ఎంత టెక్నాలజీ వాడినా.. అంతకంటే ఎక్కువ సాంకేతికతో వల వేసి పట్టుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు.
ఇదీ చూడండి: